top of page
MediaFx

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఉప్పల్‌లో మ్యాచ్ కష్టమే..

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతకు ఉక్కిరిబిక్కిరి అయిన భాగ్య‌నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. రెండు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి నగర ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. ప్ర‌స్తుతం రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంజారాహిల్స్,  కూకట్‌పల్లి, మియాపూర్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ, సికింద్రాబాద్, ఖైరతాబాద్, తార్నాక, బేగంపేట్, అల్వాల్‌, ఉప్పల్, రాంనగర్‌, కోఠి,  మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్, బేగంబజార్‌, హైటెక్‌సిటీ, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వ‌ర్షం కార‌ణంగా న‌గ‌రంలో ప‌లుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.

ఉప్పల్ ప్రాంతంలోనూ దట్టమైన మేఘాలు ఆవరించాయి. ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా ప్లే ఆఫ్ దశకు చేరాలంటే ఈ మ్యాచ్ లో గెలుపు సన్ రైజర్స్ కు ఎంతో అవసరం. అయితే, ఉప్పల్ పరిసరాల్లో వర్షం పడే అవకాశం ఉండడంతో సన్ రైజర్స్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అటు, ముందుజాగ్రత్తగా ఉప్పల్ స్టేడియంలో పిచ్ ను గ్రౌండ్ సిబ్బంది కవర్లతో కప్పి ఉంచారు. అవుట్ ఫీల్డ్ లో కూడా చాలా భాగం కవర్లతో కప్పివేశారు.

bottom of page