top of page

రాత్రిపూట నిద్రపోవడం లేదా..?

నేటి బిజీ లైఫ్‌లో చాలా మంది నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అర్థరాత్రి వరకు పని చేయడం, మొబైల్ ఫోన్ ఉపయోగించడం లేదా పార్టీలు చేసుకోవడం, ఒత్తిడి, పలు ఇబ్బందులు.. ఇవన్నీ నిద్రలేమికి కారణమవుతాయి. అయితే రాత్రి పూట మేల్కొని ఉండడం వల్ల మీ కిడ్నీలు కూడా పాడవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్ర లేకపోవడం మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మనం నిద్రపోతున్నప్పుడు, మూత్రపిండాలు వాటంతటవే రిపేర్ చేసుకుంటాయి.. శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తాయి. కానీ మనం తక్కువ నిద్రపోతున్నప్పుడు, కిడ్నీలకు ఈ పని చేయడానికి తగినంత సమయం లభించదు. అసంపూర్ణ నిద్ర మూత్రపిండాలకు హాని కలిగించడంతోపాటు.. పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.. అవేంటో తెలుసుకోండి..

రక్తపోటు పెరుగుదల: మీకు తగినంత నిద్ర లేనప్పుడు మీ శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఇది రక్తపోటు పెరుగుదలకు దారితీస్తుంది. దీంతో మూత్రపిండాలు దెబ్బతింటాయి.

ఇన్ఫ్లమేషన్ పెరుగుదల: నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో మంట పెరుగుతుంది.. ఇది కిడ్నీ దెబ్బతినే కారకాల్లో ఒకటి.

రక్తంలో చక్కెర పెరుగుదల: నిద్ర లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇంకా ఇది మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. మూత్రపిండాల వ్యాధికి మధుమేహం ప్రధాన కారణం.

రక్తప్రసరణలో తగ్గుదల: నిద్ర లేకపోవడం వల్ల కిడ్నీలో రక్తప్రసరణ తగ్గుతుంది. ఇది మూత్రపిండాల పనితీరు క్షీణించడానికి దారితీస్తుంది.

రాత్రివేళ మంచి నిద్ర కోసం చిట్కాలు: సాధారణ నిద్ర షెడ్యూల్‌ని సెట్ చేసుకోండి.. దానికి కట్టుబడి ఉండండి. నిద్రపోయే ముందు కెఫిన్, ఆల్కహాల్ మానుకోండి. నిద్రపోయే ముందు సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టించండి. పడుకునే ముందు ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించవద్దు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.. మీకు నిద్ర సమస్యలు ఉంటే, వైద్యుడిని సంప్రదించండి.మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు మంచిగా నిద్ర పోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి.

bottom of page