జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లకు వెళ్లలేనివారు ‘హూలా హూప్’ వెంట పడుతున్నారు. ఇండ్లలోనే ‘హూలా’లా అంటూ.. ‘హూపింగ్’ చేస్తున్నారు. సరదాగా.. ఉల్లాసంగా వ్యాయామం చేస్తూ, శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆనందాన్నీ పొందుతున్నారు. ఇందుకోసం యూట్యూబ్‌తోపాటు సామాజిక మాధ్యమాల్లో ‘హూలా హూప్’ వీడియోలను తెగ చూసేస్తున్నారు. తమ ‘హూపింగ్’నూ సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తూ, ఈ త్రోబ్యాక్ ఎక్సర్‌సైజ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ ‘హూలా హూప్’ను నిన్న మొన్నటిదాకా పిల్లల ఆటగానే భావించినా, ఇప్పుడు మేలైన ఎక్సర్‌సైజ్‌గా గుర్తిస్తున్నారు. నవ్వుతూ, తుళ్లుతూ ఈ వ్యాయామం చేయడం వల్ల అలసట రాదు. అందుకోసమే ఎక్కువ సమయం ఈ ఎక్సర్‌సైజ్ చేసే అవకాశం ఉంటుంది.
ఇదే.. ‘హూలా హూప్’
తేలికగా ఉండే పెద్ద రింగు(హూప్)ను నడుముకు తగిలించుకొని, శరీరాన్ని గుండ్రంగా తిప్పడమే ‘హూలా హూప్’. ఈ రింగును కింద పడనీయకుండా, వీలైనంత ఎక్కువ సమయం నడుముతో తిప్పుతూ ఉండాలి. దీనివల్ల శరీరం మొత్తానికీ కావాల్సినంత వ్యాయామం దొరకడంతోపాటు ఏరోబిక్స్ చేసిన ఫలితం దక్కుతుంది.
ప్రయోజనాలు
కనీసం 30 నిమిషాలు ‘హూలా హూప్’ చేస్తే 300 కేలరీలు ఖర్చవుతాయి.
రోజూ కనీసం 20 నిమిషాలపాటు ఈ వ్యాయామం చేస్తే గుండెకు మంచిది.
కాళ్లు, పిక్కలు, నడుము కండరాలు బిగుతుగా తయారవుతాయి. వెన్నుపూస బలపడుతుంది.
ఈ ఎక్సర్‌సైజ్ వల్ల శరీరంలో విడుదలయ్యే ఎండార్ఫిన్లు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.