top of page
Suresh D

రంగుల పండుగ హోలీ వెనుక ఉన్న ఈ మూడు కథల గురించి మీకు తెలుసా?🤔

హోలీ అంటే రంగుల పండుగ. ఎంతో ఉత్సాహంగా అందరూ కలిసి జరుపుకుంటారు. అయితే ఈ పండుగ జరుపుకోవడం వెనుక మూడు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అవేంటో తెలుసా?

దీపావళి తర్వాత అందరూ కలిసి జరుపుకునే పండుగ హోలీ. భారత్ లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ హోలీ సంబరాలు చేసుకుంటారు. ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు హోలీ పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 25 సోమవారం హోలీ పండుగ వచ్చింది. ఆదివారం మార్చి 24వ తేదీన హోలికా దహనం జరుపుకుంటారు. హోలీ అంటే రంగుల పండుగ. ఎంతో ఉత్సాహంగా అందరూ కలిసి జరుపుకుంటారు. అయితే ఈ పండుగ జరుపుకోవడం వెనుక మూడు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అవేంటో తెలుసా?

మొదటి కథ

పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తనని తప్ప వేరే దేవతలు దేవుళ్ళను ఎవరిని పూజించటానికి వీల్లేదని హిరణ్యకశిపుడు అందరిని ఆదేశిస్తాడు. కానీ ప్రహ్లాదుడు మాత్రం విష్ణువుకి మహా భక్తుడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుడు మాత్రం నారాయణుడి నామస్మరణం మానలేదు. దీంతో ప్రహ్లాదుని అగ్నిలో కాల్చి చంపాలని హిరణ్యకశిపుడు నిర్ణయించుకుంటాడు.

సోదరి హోళీకని పిలిచి ప్రహ్లాదుని తన ఒడిలో పెట్టుకొని మంటల్లో కూర్చోమని చెప్తాడు. మంటల వల్ల ఆమెకి ఎటువంటి హాని కలగకుండా ఒక మాయ వస్త్రాన్ని ఇస్తాడు. కానీ ప్రహ్లాదుడు హరినామ స్మరణ వల్ల ఆ మాయా వస్త్రం హోళీక మీద నుంచి ప్రహ్లాదుడు మీదకు రావడంతో తను మంటల్లో దహనం అయిపోతుంది. దీన్నే హోలికా దహనం అంటారు. ప్రజలను వేధిస్తున్న హోళీక పీడ విరగడయినందుకు సంతోషంగా ప్రజల హోలీ సంబరాలు జరుపుకున్నారని పురాణాలు చెబుతున్నాయి.

రెండవ కథ

సతీదేవి మరణం తర్వాత పరమేశ్వరుడు సృష్టికార్యం మరిచి ధ్యానంలో మునిగిపోయాడు. ఆయన కోసం మళ్లీ జన్మించిన సతీదేవి రూపమైన పార్వతీదేవిని గుర్తించడు. జగత్ కార్యం కోసం ఎలాగైనా పార్వతీదేవి, శివుడికి వివాహం జరిపించడం కోసం దేవతలందరూ కలిసి మన్మథుడిని పురమాయిస్తారు. శివుడు ధ్యానంలో ఉన్న సమయంలో మన్మథుడు తన పూల బాణాన్ని ప్రయోగించడంతో శివుడు ధ్యానం భగ్నమవుతుంది.

కోపోద్రిక్తుడు అయిన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు. తన భర్తను బ్రతికించమని రతీదేవి వేడుకుంటుంది. శివుడి అనుగ్రహం కోసం తపస్సు చేస్తుంది. ఆమె తపస్సుకి కరిగిపోయిన పరమేశ్వరుడు మన్మథుడిని ద్వాపర యుగంలో కృష్ణుడి పుత్రునిగా జన్మిస్తాడని వరం ఇస్తాడు. అలా శివుని ఆగ్రహానికి గురైన మన్మథుడు చనిపోయిన రోజుని కామ దహనంగా జరుపుకుంటారు. ఆరోజు పౌర్ణమి. మనలోని అసందర్భమైన కామాన్ని దహించి వేయడానికి గుర్తుగా కాముని దహనాన్ని జరుపుకుంటారు. దీన్నే హోలీ అని కూడా పిలుస్తారు.

మూడో కథ

గుజరాత్ లోని బ్రజ్ ప్రాంతంలోనే బర్సానాలో రాధాకృష్ణుల ప్రేమకు ప్రతీకగా హోలీ వేడుక జరుపుకుంటారు. ఇక్కడ కృష్ణుడు రాధతో రంగుల హోలీ ఆడాడని చెప్తారు. ఇక్కడ హోలీ వినూత్నంగా ఉంటుంది. ఆడపిల్లలు రాధా స్వరూపిణిగా, అబ్బాయిలు కృష్ణుడిగా భావించుకుంటారు. తమకి రంగులు పూయడానికి వచ్చిన అబ్బాయిలను ఆడపిల్లలు సరదాగా కర్రలతో వాళ్ళని కొట్టేందుకు ప్రయత్నిస్తారు. దీన్నే లాత్మార్ హోలీ అంటారు. అందమైన మేని ఛాయతో ఉన్న రాధతో తన నల్లని స్వరూపం పోల్చుకుని కృష్ణయ్య చిన్నబుచ్చుకుంటాడు. అప్పుడు యశోదమ్మ రాధకి రంగులు పూయమని సలహా ఇస్తుంది. అలా ఇక్కడ రాధాకృష్ణుల హోలీ జరిపిస్తారు.

bottom of page