దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రైతుల ఛలో ఢిల్లీ కార్యక్రమం నేపత్యంలో హస్తిన దిగ్బంధనమైంది. రైతుల ధర్నాను భగ్నం చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కేంద్రమంత్రుల బృందంతో చర్చలు విఫలం కావడంతో.. ఉద్యమానికి సై అంటున్నారు రైతులు. ఉత్తరాదిలోని మూడు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 20 వేల మంది రైతులు ఛలో ఢిల్లీ చేపట్టారు. 2021 నాటి రైతుల ఉద్యమాన్ని తలపిస్తోంది ఛలో ఢిల్లీ. మళ్లీ ఉద్రిక్తతకు చోటివ్వకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు పోలీసులు.
పంటకు కనీస మద్దతు ధరపై భరోసా కల్పించాంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, పంటరుణాలు మాఫీ చేయాలని, రైతులకు, రైతు కూలీలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, నల్లచట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతులపై కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
అయితే రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణకు కేంద్ర మంత్రుల బృందం సరేనంది. నాటి పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం విషయంలో కూడా సానుకూలంగా స్పందించింది. మినిమమ్ సపోర్ట్ ప్రైస్.. MSPకి చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండ్ దగ్గరే పీటముడి పడింది. ప్రభుత్వం ససేమిరా అనడంతో ‘ఢిల్లీ చలో’కి నడుం బిగించాయి రైతు సంఘాలు. 🚜🌾