top of page
MediaFx

‘ఏయ్.. మా నాన్న ఎవరో తెలుసా?’ కారుతో ఢీకొట్టి ఇద్దరిని చంపిన యువతి..


సదరు మహిళను న‌టాషా దానిష్ అలీగా పోలీసులు గుర్తించారు. ఆమె పాక్‌లోని ప్రఖ్యాత వ్యాపార‌వేత్త దానిష్ ఇక్బాల్ భార్య. ఆగ‌స్టు 19వ తేదీన ఆమె కారులో రోడ్డుపై మితిమీకిర వేగంతో వెళ్తూ.. బైక్‌, ఆగివున్న కారుతో సహా పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రీకూతుళ్లు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు క్లిప్‌లో నెట్టింట వైరల్ అయ్యాయి. కారుతో ఢీకొట్టి ఇద్దరి మ‌ర‌ణానికి కార‌ణ‌మైన ఆమె .. ఆ సంఘ‌ట‌న త‌ర్వాత వింత‌గా ప్రవ‌ర్తించింది. కెమెరా వైపు చూసి, నిర్లక్ష్యంగా న‌వ్వుతూ కనిపించింది. ప‌శ్చాతాపం ఏ కొశానా క‌నిపించ‌లేదు. పైగా మా నాన్న ఎవ‌రో మీకు తెలియ‌ద‌ని వార్నింగ్ కూడా ఇచ్చింది. దీంతో సదరు యువతి చర్యను నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. సోషల్‌ మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు. స్థానిక న్యూస్‌ కథనాల ప్రకారం.. న‌టాషా దానిష్ (32) కరాచీలో పుట్టింది. పాక్‌లో ప్రముఖ వ్యాపారి డానిష్ ఇక్బాల్‌ను కొన్నాళ్ల క్రితం వివాహం చేసుకుంది. గుల్ అహ్మద్ ఎన‌ర్జీ సంస్థకు చైర్మెన్‌. ఈ దంపతులకు క‌రాచీలోని కేడీఏ స్కీమ్ -1 ఏరియాలో విలాసవంతమైన నివాసం ఉంది. ప్రమాద సమయంలో నటాషా మద్యం మత్తులో ఉందని, ప్రమాదం తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు అడ్డుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరోవైపు ఆమె మాన‌సిక పరిస్థితి సరిగ్గాలేదని, జిన్నా ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని నటాషా తరపు న్యాయవాది అమీర్ మన్సుబ్ మీడియాకు తెలిపారు. ఆమెకు చికిత్స పూర్తైందని, ఆమెకు ఎలాంటి చికిత్స అవసరం లేదని, డిశ్చార్జ్ కూడా అయినట్లు ఆసుపత్రి రికార్డులు చెబుతున్నాయి. నటాషా మానసిక అనారోగ్యాన్ని సాకుగా చెబుతూ కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతుంది. ప్రస్తుతం ఆమె 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నట్లు స్థానిక మీడియా చెబుతోంది. సామాన్య జనాల ప్రాణాలంటే బలిసినోళ్లకు ఎప్పుడూ అలుసే..!





bottom of page