top of page
MediaFx

ఇప్పట్లో తగ్గేదేలే.. వర్షాలే వర్షాలు..! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..


తెలుగు రాష్ట్రాల్లో కరువుతీరా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళఖాతంలో అయితే ఒకదాని తరువాత ఒక అల్పపీడనం ఏర్పడుతూనే ఉంది. దీంతో ఇప్పట్లో ముసురు ఆగదు.. వర్షాలు తగ్గవు అనేలా పరిస్థితి కనిసిస్తోంది.. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపుల‌తో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందనే హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శుక్రవారం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లోని అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.కాగా.. నాలుగు రోజులుగా ముసురు ఏకధాటిగా పడుతుండటంతో రెండు రాష్ట్రాల్లోనూ వాగులు, వంకలు పొంగి చెరువులు నిండాయి. బ్యారేజీల్లోకి వరద పోటెత్తుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి వరద ప్రవాహం 48 అడుగులకు చేరింది. దీంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ వరద పోటు మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. దిగువ పోలవరానికి 11 లక్షల 31వేల క్యూసెక్కుల వరద వెళ్తోంది.

bottom of page