top of page
MediaFx

భారతీయుడి గుండెతో పాక్ యువతికి కొత్త జీవితం


ఓ భారతీయుడి గుండె పాకిస్థాన్‌ యువతికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో విజయవంతంగా అవయవమార్పిడి చికిత్సను నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స కోసం ఆస్పత్రితో పాటు ట్రస్టు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా దాతృత్వాన్ని చాటుకున్నారు. పాకిస్థాన్‌‌లోని కరాచీకి చెందిన 19 ఏళ్ల యువతి ఆయేషా రషన్‌ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయాలని, ఆ వ్యాధి ఊపిరితిత్తులకు కూడా వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు గుర్తించారు. గుండెమార్పిడి చేయకుంటే ఆమె ఎక్కువకాలం బతకదంటూ తెలిపారు. ఈ శస్త్రచికిత్సకు సుమారు రూ.35 లక్షలకు పైగా ఖర్చువుతుందని, భారత్‌‌కు తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో తమ కుమార్తె భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే రషన్‌ను ఆదుకునేందుకు ముందుకొచ్చిన చైన్నైకు చెందిన ఐశ్వర్యన్ అనే స్వచ్ఛంద సంస్థ.. భారత్‌లో సర్జరీకి ఏర్పాట్లు చేసింది. చెన్నైలోని ఎమ్‌జీఎమ్‌ హెల్త్‌కేర్‌ ఆస్పత్రిలో నిపుణుల బృందం ఆ యువతికి.. అవయవదానం చేసిన భారతీయుడి గుండెను విజయవంతంగా అమర్చింది. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించి, మానవత్వానికి ఎల్లలు లేవని నిరూపించారు.

bottom of page