ఒక వ్యక్తి తన శరీరానికి అవసరమైన దానికంటే తక్కువగా నిద్రపోతే..అతడికి నిద్రలేమి సంభవిస్తుంది. నిద్రలేమి ప్రభావం వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది. అయితే ఒక వ్యక్తి 2 రాత్రులు (48 గంటలు), 3 రాత్రులు (72 గంటలు) నిద్రపోకపోతే ఏమవుతుందో తెలుసా?
చాలా మందిలో 24 గంటల పాటు మెలకువగా ఉన్న తర్వాత దుష్ప్రభావాలు కనిపించడం ప్రారంభిస్తాయి. 24 గంటలు మేల్కొన్న వ్యక్తిలో రక్తంలో BAC స్థాయి 0.10 శాతానికి సమానం. ఇది చిరాకు, ఏకాగ్రత కోల్పోవడం, విపరీతమైన ఒత్తిడి, కండరాల నొప్పి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటం వంటిది కలిగిస్తుంది. అలాగే, ఒక వ్యక్తి ఎంత మెలకువగా ఉంటే నిద్ర లేమి ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా 48 గంటలు నిరంతరం మేల్కొని ఉంటే, వారు చాలా అలసిపోతారు. వారు కళ్ళు తెరవడానికి కూడా బాధపడుతుంటారు.. వారి మెదడు మైక్రోస్లీప్ అని పిలువబడే పూర్తి అపస్మారక స్థితికి వెళ్లడం ప్రారంభమవుతుంది.
నిద్ర లేకుండా 72 గంటల పాటు ఉంటే.. ఆ తర్వాత అలసట లక్షణాలు తీవ్రమవుతాయి. మూడు రోజుల పాటు నిద్ర లేకుండా ఉండటం వల్ల మనిషి మానసిక స్థితి, ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. మూర్ఛ, చిరాకు, ఇతరులతో మాట్లాడలేకపోవడం వంటి దుష్ప్రభావాలు కూడా కనిపిస్తాయి. ఒక వ్యక్తి స్థిరంగా తగినంత నిద్ర పొందకపోతే, వారు అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, డిప్రెషన్ వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. 😴💤