కరోనాకు, గుండెపోటుకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే అనుమానాలు రోజురోజుకూ తీవ్రం అవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడింది.
హార్ట్ అటాక్ రావడానికి కారణం, దాన్ని రాకుండా నివారించేందుకు మార్గాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వివరించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) చేసిన రీసెర్చ్ ఉదహరించిన మన్‌సుఖ్ మాండవీయ.. గతంలో కరోనా వచ్చి రికవర్ అయినవారికి వారికి కొన్ని సూచనలు చేశారు. కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న బాధితులు.. ఒకటి-రెండు సంవత్సరాల పాటు ఒత్తిడి, శ్రమతో కూడిన పనులు చేయకపోవడం మంచిదని చెప్పారు. ఎక్కువగా శారీరక శ్రమ లేకుండా చూసుకుంటే.. ప్రమాదకర గుండె పోటు నుంచి రక్షించుకోవచ్చన్నారు. కరోనా తగ్గిన తర్వాత రెండేళ్ల వరకూ కఠినమైన వ్యాయామాలకు దూరంగా ఉండాలన్నారు. కరోనా సోకిన వ్యక్తులకు.. గుండె పోటు ముప్పుపై ICMR ఒక వివరణాత్మక అధ్యయనం చేసిందని మన్‌సుఖ్ మాండవీయా తెలిపారు. ఆ రీసెర్చ్ ప్రకారం తీవ్రమైన కొవిడ్ ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది పడ్డవారు ఎక్కువ శ్రమతో కూడిన పనులు చేయకూడదని హెచ్చరించారు. ఎక్కువ సమయం విశ్రాంతికి కేటాయించాలన్నారు. ఎక్కువ కాలం కఠిన వ్యాయామానికి దూరంగా ఉంటే గుండె పోటు నుంచి రక్షణ పొందవచ్చన్నారు.