హనుమాన్ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకెళుతోంది. ఈ తరుణంలో ఈ మూవీ సీక్వెల్ ‘జై హనుమాన్’ సినిమా గురించి అప్‍డేట్ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఓ విషయాన్ని పంచుకున్నారు.🎥🕉️
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ (హను-మ్యాన్) చిత్రం భారీ విజయం దిశగా ముందుకు సాగుతోంది. ఊహలకు మించి ఘన విజయం సాధిస్తోంది. ఈ సూపర్ హీరో చిత్రంలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించారు. హనుమంతుడి వల్ల అతీత శక్తులు పొంది సూపర్ హీరో అయ్యే హనుమంతు పాత్రను ఈ చిత్రంలో పోషించి మెప్పించారు తేజ. హనుమాన్ మూవీ 10 రోజుల్లోనే రూ.200 కోట్ల మార్కు దాటి.. ఇంకా జోరు కొనసాగిస్తోంది. కాగా, ఈ చిత్రానికి సీక్వెల్‍గా ‘జై హనుమాన్’ చిత్రాన్ని తీసుకొస్తామని మూవీ టీమ్ ఇప్పటికే ఖరారు చేసింది.
‘జై హనుమాన్’ మూవీ 2025లో వస్తుందని హనుమాన్ చివర్లోనే మేకర్స్ స్పష్టం చేశారు. హనుమాన్ అద్భుతంగా ఉండడంతో సీక్వెల్‍పై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కాగా, ‘జై హనుమాన్’ చిత్రంపై దర్శకుడు ప్రశాంత్ వర్మ నేడు (జనవరి 22) ఓ అప్‍డేట్ ఇచ్చారు.
జై హనుమాన్ సినిమా స్క్రిప్ట్ పనులను నేడు మొదలుపెట్టినట్టు ప్రశాంత్ వర్మ తెలిపారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించినట్టు ప్రకటించారు. అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు.
“ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు హనుమాన్‍పై చూపిస్తున్న అమితమైన ప్రేమ, మద్దతు పట్ల కృతజ్ఞతతో.. నేను కొత్త ప్రయాణంతో నిల్చున్నా. శుభప్రదమైన రామమందిర ప్రాణప్రతిష్ఠ రోజున జై హనుమాన్ ప్రీ-ప్రొడక్షన్ మొదలైంది” అని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. స్క్రిప్ట్ బుక్‍ను పట్టుకొని హనుమంతుడి ముందు నిల్చున్న ఫొటోను పోస్ట్ చేశారు. అలాగే, జై హనుమాన్ బిగిన్స్ అనే పోస్టర్ వెల్లడించారు.
హనుమాన్ మూవీ చివర్లో ‘నువ్వు (హనుమంతుడు) శ్రీరామచంద్రుడికి ఇచ్చిన మాట ఆసన్నమైంది” అని సముద్రఖని చెప్పే డైలాగ్ ఉంది. రాముడికి హనుమంతుడు ఏ మాట ఇచ్చాడన్నది ‘జై హనుమాన్’ సినిమాలో ప్రధాన అంశంగా ఉంటుందని హింట్ ఇచ్చారు మేకర్స్.🎥🕉️