గుంటూరు కారం మూవీ టికెట్ల ధరలు ఆంధ్రప్రదేశ్ లోనూ పెరిగాయి. టికెట్ల ధర పెంపుకు అనుమతిస్తూ బుధవారం (జనవరి 10) ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి వస్తున్న మరో సంక్రాంతి మూవీ గుంటూరు కారం టికెట్ల ధరలు ఆంధ్రప్రదేశ్ లోనూ పెరిగాయి. శుక్రవారం (జనవరి 12) రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టికెట్ల ధరను పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణలోనూ మూవీ టికెట్ల ధరలు పెంచిన విషయం తెలిసిందే.
తెలంగాణ రేంజ్ లో కాకపోయినా.. ఏపీలో గుంటూరు కారం టికెట్ల ధరలను రూ.50 మేర పెంచేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పెంపు కూడా మూవీ రిలీజైన తర్వత పది రోజులకే వర్తిస్తుంది. ఈ భారీ బడ్జెట్ మూవీ కోసం టికెట్ల ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇటు తెలంగాణ, అటు ఏపీ ప్రభుత్వాలను మేకర్స్ కోరారు.
కాస్త ఆలస్యంగా అయినా ఏపీలో టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి లభించడంతో మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు. సంక్రాంతి సినిమాలకు ఏపీలో డిమాండ్ ఎక్కువ. ఈసారి వీకెండ్ కూడా కలిసి రావడంతో తొలి ఐదు రోజుల్లో మంచి వసూళ్లు సాధించాలని సంక్రాంతి సినిమాలు చూస్తున్నాయి. అయితే గుంటూరు కారం మూవీకి హనుమాన్ నుంచి కూడా పోటీ ఎదురవుతోంది.
ఇప్పటికే గుంటూరు కారం టికెట్ల ధర తెలంగాణలోనూ పెంచారు. ఏపీ కంటే ఎక్కువగా తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీప్లెక్స్ లలో రూ.100 పెంచేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో మల్టీప్లెక్స్ లలో గరిష్ఠంగా రూ.470 వరకు, సింగిల్ స్క్రీన్లలో రూ.270 వరకూ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక తెలంగాణలో తొలి వారం రోజుల పాటు రోజుకు ఆరు షోలను ప్రదర్శించేందుకు కూడా అనుమతి లభించింది.
గురువారం అర్ధరాత్రి 1, తెల్లవారుఝాము 4 గంటలకు కూడా స్పెషల్ షోలు ఉండనున్నాయి. దీంతో మహేష్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. గురువారం అర్ధరాత్రి నుంచే ఫ్యాన్స్ హడావిడి మొదలు కానుంది. రెండేళ్ల కిందట సర్కారు వారి పాట తర్వాత మరో మహేష్ సినిమా రాలేదు. దీంతో గుంటూరు కారం క్రేజ్ మరింత పెరిగిపోయింది.
ఈ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఫ్యాన్స్ లో ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ట్రైలర్ సరికొత్త రికార్డు క్రియేట్ చేయడమే మూవీకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో చెబుతోంది. తొలి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ వచ్చిన సౌత్ ఇండియన్ మూవీగా గుంటూరు కారం నిలిచింది. ఈ లెక్కన బాక్సాఫీస్ రికార్డులు కూడా తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
మాస్ అవతారంలో మహేష్ కనిపించాడు. ట్రైలర్ లో అతని మేనరిజం, డైలాగ్స్ చెప్పిన తీరు, శ్రీలీలతో కుర్చీ మడత పెట్టి పాటలో వేసిన స్టెప్పులు అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. అతడు, ఖలేజా తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో గుంటూరు కారంతో హ్యాట్రిక్ ఖాయమన్న ఆశతో ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఈ మూవీ ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.🎥🌟