కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్‌లో హిడెన్ కెమెరాల విషయంపై ఐజీ అశోక్‌కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. పోలీసుల దర్యాప్తులో ఎటువంటి రహస్య కెమెరాలను గుర్తించలేదని ఆయన తెలిపారు. విద్యార్థినులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కేసు విచారణకు సంబంధించిన వివరాలను ఎస్పీ గంగాధర్‌తో కలిసి ఆయన గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు.
ప్రత్యేక మహిళా బృందంతో కలిసి హాస్టల్ గదుల్లో తనిఖీ చేశామని.. ఎక్కడా కెమెరాలు కనిపించలేదని ఐజీ అశోక్‌కుమార్ వెల్లడించారు. 35 మంది విద్యార్థినులు, వార్డెన్లు, సిబ్బందినీ విచారించగా.. కెమెరాలు కానీ, వీడియోలు కానీ ప్రత్యక్షంగా చూసినట్లు ఏ ఒక్కరూ చెప్పలేదని స్పష్టం చేశారు. హిడెన్ కెమెరాలు, వీడియోల అంశం ఎవరో చెబితేనే తమకు తెలిసిందని విచారణలో విద్యార్థులు చెప్పారని అన్నారు. సీఎం చంద్రబాబు చొరవతో ఢిల్లీకి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్‌టీ), పుణెకు చెందిన సీ డాక్ టెక్ నిపుణుల సాయంతో విద్యార్థుల ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు ఇతర గ్యాడ్జెట్లనూ తనిఖీ చేశామని చెప్పారు.
వారం రోజలు పాటు సాగిన దర్యాప్తులో హిడెన్ కెమెరాల ఏర్పాటు, వీడియోల షేరింగ్ జరగలేదని నిర్ధారించామని ఐజీ అశోక్‌కుమార్ తెలిపారు. ఒకవేళ ఎవరైనా సాక్ష్యాలతో ముందుకొస్తే దర్యాప్తు కొనసాగిస్తామని పేర్కొన్నారు. గుడ్లవల్లేరు కాలేజీ వ్యవహారంపై సోషల్‌మీడియాలో జరిగిన దుష్ప్రచారంపై కూడా విచారణ జరుపుతున్నామని చెప్పారు. వచ్చిన వివరాల ఆధారంగా వాటిపైనా చర్యలు చేపడతామని అన్నారు.