top of page
MediaFx

వేసవిలో గ్రీన్‌ టీ తాగొచ్చా? రోజుకు ఎన్ని సార్లు తాగితే మంచిది..


బరువు తగ్గడానికి వేసవిని ఉత్తమ సమయంగా పరిగణిస్తారు. ఎందుకంటే అధిక చెమట, కొవ్వు ఈ కాలంలో సులభంగా కరిగిపోతుంది. ఈ సీజన్‌లో తేలికైన ఆహారాన్ని తినాలని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారు చాలా విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు వ్యాయామంపైనే కాకుండా ఆహారంపై కూడా ఎక్కువ దృష్టి పెట్టాలి. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో ఒకటి గ్రీన్ టీ ముఖ్యమైనది. గ్రీన్ టీ జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే వేసవిలో దీన్ని రెగ్యులర్ గా తాగాలా.. వద్దా.. అనేది ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. గ్రీన్ టీని నిరంతరంగా తాగితే లూజ్ మోషన్స్‌కు దారితీస్తుందని కొందరు భావిస్తారు. ఇక వేసవిలో గ్రీన్ టీని రోజూ తాగాలా.. వద్దా.. అని పదేపదే ఆలోచిస్తుంటారు. ఈ ప్రశ్నలకు ఇక్కడ సమాధానం తెలుసుకుందాం..

గ్రీన్ టీ ప్రయోజనాలు

బరువు తగ్గాలనుకునే వారికే కాదు.. సాధారణ వ్యక్తులు కూడా గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యంగా కనిపిస్తారు. పొట్టలోని కొవ్వును కరిగించడంలో గ్రీన్‌ టీ హితోధికంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది జీవక్రియను పెంచుతుంది. కడుపు అనారోగ్యకరంగా ఉంటే పలు రకాల వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అయితే గ్రీన్ టీ తాగడం ద్వారా కడుపు ఎప్పటి కప్పుడు శుభ్రంగా మారడం వల్ల, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

నిపుణులు ఏమంటున్నారంటే..

గురుగ్రామ్‌లోని నారాయణ హాస్పిటల్ సీనియర్ డైటీషియన్ మోహిని డోంగ్రే ఏం చెబుతున్నారంటే.. వేసవిలోనే కాదు ఏ సీజన్‌లోనైనా గ్రీన్ టీ తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. అయితే వేసవిలో వేడి నుండి ఉపశమనం పొందడానికి గ్రీన్ టీ మంచి ఎంపిక. వాస్తవానికి, వేసవిలో మన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీని కారణంగా డీహైడ్రేషన్ కూడా సంభవిస్తుంది. దీని వల్ల శరీరం త్వరగా అలసిపోతుంది. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, హైడ్రేట్ గా ఉంచడం సాధ్యమవుతుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేసుకోవచ్చు.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

వేసవిలో జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను నయం చేయడంలో కూడా గ్రీన్ టీ ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. వేసవిలో రోజుకు గరిష్టంగా రెండు కప్పుల గ్రీన్ టీ తాగాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత ఒక కప్పు గ్రీన్ టీ తాగవచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇక రెండవ కప్పు గ్రీన్ టీని సాయంత్రం లేదా రాత్రి ఎప్పుడైనా తీసుకోవచ్చు. గ్రీన్ టీని ఇంతకు మించి అధికంగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది మలబద్ధకం, అసిడిటీ వంటి అనేక సమస్యలను కలిగిస్తుంది.

bottom of page