ఇండోనేషియా పర్యాటకుల కలల ప్రదేశం. బాలి టూరిస్ట్ డెస్టినేషన్. ఇక్కడి ప్రకృతి అందాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఇండోనేషియా వెళ్లేందుకు ఇకపై భారతీయులకు వీసా అవసరం లేదు. వీసా లేకుండా బాలికి ప్రయాణించవచ్చు.
కరోనా తరవాత ఇండోనేషియాలో విదేశీ పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. దీంతో ఆదేశంలోని పర్యాటక రంగంలోని ఆదాయం కూడా తగ్గింది. ఈ నేపధ్యంలో దేశ టూరిజ రంగానికి ఊపిరి అందించాలని భావిస్తూ భారత్‌తో సహా 20 దేశాల పర్యాటకులకు వీసా రహిత ప్రవేశాన్ని ప్రవేశపెట్టాలని ఇండోనేషియా యోచిస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి శాండియాగా యునో తెలియజేస్తూ ఈ ఏడాది అక్టోబర్‌లోపు ఈ విధానాన్ని ఖరారు చేస్తామని ప్రకటించారు. ఇండోనేషియాలో అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడం ఈ చర్య లక్ష్యం.
ఆస్ట్రేలియా, చైనా, జపాన్, యుఎస్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, జర్మనీ, ఖతార్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) సహా భారతదేశంతో సహా దేశాల నుండి పర్యాటకులను వీసా లేకుండా తమ దేశంలోకి అనుమతించాలని ఇండోనేషియా యోచిస్తోంది.
ఇండోనేషియా అధికారిక గణాంకాల పోర్టల్ ప్రకారం 2023లో 6 లక్షలకు పైగా భారతీయ పర్యాటకులు దేశాన్ని సందర్శించారు. ఈ సంవత్సరం జనవరి నుంచి మార్చి మధ్య, భారతదేశం నుంచి 30,000 మందికి పైగా ప్రయాణికులు ఇండోనేషియాకు వెళ్లారు.
ప్రస్తుతం, ఇండోనేషియాను సందర్శించాలనుకునే భారతీయ పర్యాటకులు ఆన్‌లైన్‌లో లేదా ఇండోనేషియా విమానాశ్రయాలలో వీసాను పొందవచ్చు. ఇండొనేసియాకి వెళ్లే పర్యాటకుల్లో భారతీయుల సంఖ్య ఎక్కువ. ముఖ్యంగా దక్షినాది వారు ఎక్కువగా ఇండోనేషియాకు వెళ్తారు.
ఇండొనేసియా కరెన్సీ విలువ మన భారత రూపాయితో పోల్చితే చాలా తక్కువ. ఇండొనేసియా రూపాయి మారకపు విలువ మన రూపాయితో 194గా ఉంది. అంటే మనం 10 రూపాయలు ఇస్తే.. ఇండొనేసియా కరెన్సీని 1940 తీసుకోవచ్చు. దీంతో అక్కడ తక్కువ డబ్బులతో ఎక్కువ షాపింగ్ చేయవచ్చు. అంతేకాదు హిందూ సంప్రదాయం బాగా కనిపిస్తుంది ఈ దేశంలో..
ఇప్పటికే భారతీయులు థాయ్‌లాండ్, శ్రీలంక, ఇరాన్, మలేషియా దేశాలకు వెళ్లేందుకు వీసా అవసరం లేదు. ఇండోనేషియా కూడా ఈ వరుసలో చేరుతుందని భావిస్తున్నారు.
అంతేకాకుండా, దక్షిణాఫ్రికా, వియత్నాం, రష్యా కూడా భారతీయ ప్రయాణికులకు వీసా మినహాయింపును అనుమతించడాన్ని పరిశీలిస్తున్నాయి.
ఇండోనేషియా ప్రభుత్వం 2024 నాటికి 17 మిలియన్ల పర్యాటకులను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది మొదటి 5 నెలల్లో 5.2 మిలియన్ల మంది పర్యాటకులు నమోదయ్యారు.
ఇక్కడి వరి పొలం, సముద్ర తీరం, ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.