top of page
MediaFx

ప్రజ్వల్‌కు లైంగిక సామర్థ్య పరీక్షలు

హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై లైంగిక దౌర్జన్య ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనకు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించేందుకు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు బుధవారం బౌరింగ్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించారు. మొత్తం మూడు రకాల పరీక్షలు చేస్తున్నామని సిట్ అధికారులు పేర్కొన్నారు.

లైంగిక వేధింపుల కేసులో సామర్థ్యాన్ని నిర్దారించే ప్రక్రియలో భాగంగా పోటెన్సీ టెస్ట్‌ను నిర్వహిస్తారు. నిందితుడి వీర్యం, స్పెర్మ్ కౌంట్, సాధారణ శారీరక పరీక్ష, అంగస్తంభన, గర్భం కలిగించే సంభావ్యత వంటి అంశాలను పరిశీలిస్తారు.

సిట్ ప్రశ్నలకు సమాధానం దాటవేస్తూ ప్రజ్వల్ పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్నాడు. 'రాజకీయ కుట్ర' అని ఆరోపిస్తూ, తన లాయర్ ద్వారా మాత్రమే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని అంటున్నాడు. మరోవైపు, ప్రజ్వల్ అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో కొందరు అమ్మకానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలను షేర్ చేయడం లేదా విక్రయించడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు.

ప్రజ్వల్ ఆరు రోజుల సిట్ కస్టడీ గురువారంతో ముగియనుంది. కస్టడీని పొడిగించేందుకు కోర్టు ముందు హాజరు పరచనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజ్వల్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మాజీ ప్రధాని దేవెగౌడ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చిన ప్రజ్వల్, తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల ముందు ఈ అశ్లీల వీడియోలు వెలుగులోకి రావడంతో, ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్ధి శ్రేయస్ పటేల్ చేతిలో 43,756 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

bottom of page