top of page
Suresh D

ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఇవి పాటించకపోతే అంతే..🛍️🚫

ఆన్‌లైన్ షాపింగ్ చేసే సమయంలో సరైన జాగ్రత్తలు పాటించకుంటే జేబు గుల్ల అవడమే కాకుండా.. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

ప్రస్తుత ఇంటర్‌నెట్ యుగంలో ఆన్‌లైన్ షాపింగ్‌కు భలే గిరాకీ ఉంది. కరోనా వైరస్ తర్వాత ఈ ఆన్‌లైన్ షాపింగ్‌ మరింత విస్తరించింది. అయితే ఆన్‌లైన్‌ షాపింగ్ చేసే సమయంలో కనీస జాగ్రత్తలను పాటించాలి. లేకపోతే మనం మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆన్‌లైన్ ప్రపంచంలో నకిలీవి ఏవో నాణ్యమైనవి ఏవో నిర్ధారించుకున్న తర్వాతే కొనుగోలు చేయాలి. ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే.. అలాంటి వస్తువులు, సైట్లకు దూరంగా ఉండటమే చాలా ఉత్తమం. 

వెబ్‌సైట్ కంపెనీ

చూడగానే కొనాలనే విధంగా ఆకర్షణీయమైన బట్టలు లేదా వస్తువు ఫోటోలను వెబ్‌సైట్‌లలో ఉంచుతారు. వాటిని కొనుగోలు చేయించేందుకు సోషల్ మీడియాలో అనేక ప్రకటనలు ఇస్తుంటారు. అయితే అలాంటి వెబ్‌సైట్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ వెబ్‌సైట్ రిజిస్టర్ కార్యాలయం యొక్క పూర్తి చిరునామా, ల్యాండ్‌లైన్ నంబర్ మరియు ఇతర సమాచారాన్ని తనిఖీ చేయడం ముఖ్యం. ఏ కంపెనీ వెబ్‌సైట్‌లోనైనా వారి పూర్తి సమాచారం కనిపించకపోతే అలాంటి సైట్‌లో వస్తువులు కొనుగోలు చేయకపోవడమే ఉత్తమం.

క్యాష్ ఆన్ డెలివరీ

పేరున్న కంపెనీలు, వెబ్‌సైట్‌లలో అయితే ముందుగానే చెల్లింపులు చేసి వస్తువులను ఆర్డర్ చేస్తుంటాం. అయితే ఇటీవల అనేక కొత్త కొత్త కంపెనీలు వివిధ పేర్లతో ఆన్‌లైన్ షాపింగ్‌లో దర్శనమిస్తున్నాయి. ఆకర్షనీయమైన ఆఫర్లతో ప్రకటనలు గుప్పిస్తున్నాయి. అయితే అలాంటి వాటిని చూసి గుడ్డిగా నమ్మడం అంత మంచిది కాదు. ఆన్‌లైన్‌లో ఆ వస్తువును కొని.. అక్కడే డబ్బులు చెల్లిస్తే.. ఆయా కంపెనీలు వాటిని డెలివరీ చేయకుండా మోసం చేసే ప్రమాదం ఉంటుంది. కొత్త కొత్త సైట్లలో షాపింగ్ చేస్తే డెలివరీ అయ్యాకే డబ్బులు ఇవ్వడం మంచిది. అంటే క్యాష్ ఆన్ డెలివరి ఆప్షన్ ఎంచుకోవాలి. ఒక వేళ వారు ఈ ఆప్షన్ ఇవ్వక పోతే అలాంటి సైట్లలో కొనుగోలు చేయకపోవడమే మేలు. కొన్నిసార్లు షాపింగ్ చేసే సమయంలో చెల్లిస్తే మరింత రాయితీలు ఇస్తామని ప్రలోభ పెడతారు. వాటిని పట్టించుకోకుండా క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకోవడమే బెటర్.

నాణ్యత

ఎలాగూ ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తున్నారని ఆశపడి కొంటే నాణ్యత లేని వస్తువులు వస్తుంటాయి. ఇలా మనం మోసం పోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దీంతో ఏదైనా వస్తువును కొనే ముందు.. దాన్ని ఇదివరకే కొనుగోలు చేసిన వారు పెట్టిన ఫొటోలు, రివ్వ్యూలు, రేటింగ్ చూసి.. ఆ వస్తువు కొనుగోలు చేయాలా లేదా అని సరైన నిర్ణయం తీసుకోవాలి. తక్కువ ధరకు వస్తుందని నాణ్యత లేని వస్తువులను కొంటే తర్వాత ఇబ్బంది పడక తప్పదు.

వారంటీ, గ్యారంటీ

కొన్ని వస్తువులను ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసినపుడు వారంటీ, గ్యారంటీలు ఇస్తారు. ఏసీ, టీవీ, ఫ్రిజ్, మైక్రోవేవ్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు తప్పనిసరిగా వారంటీని చెక్ చేయాలి. మంచి నాణ్యతతో ఎక్కువ కాలం వారంటీ అందించే వస్తువులను కొనుగోలు చేయడం ఉత్తమం. 

సైబర్ భయాలు:ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేటపుడు చెల్లింపుల సమయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. డెబిట్, క్రెడిట్ కార్డులు.. యూపీఐ, ఓటీపీ నంబర్ల విషయంలో జాగ్రత్త వహించాలి. ఎవరు పడితే వారు ఫోన్ చేసి.. కార్డు నంబర్లు, ఓటీపీ నంబర్ చెప్పమని అడిగితే అస్సలు చెప్పకూడదు. మన వ్యక్తిగత బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోకపోవడమే మంచిది. మన బ్యాంకు వివరాలను ఎలాంటి ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలు అడగవు. ఈ విషయాన్ని మాత్రం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.🛍️🚫

bottom of page