top of page
Suresh D

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో సంచలనం..


తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌ పోలీసులు డొంక కదిలించే పనిలో ఉన్నారు. ఇప్పటికే.. పలువురు సీనియర్ పోలీస్ అధికారులు అరెస్టు కాగా.. విచారణలో విస్తుపోయే విషయాలు బహిర్గతం అవుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఫోన్‌ ట్యాంపింగ్‌ కేసులో మరో సంచలనం నమోదైంది. ఈ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్-1885ను జతపరుస్తూ పోలీసు అధికారులు నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. అయితే.. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో టెలిగ్రాఫ్ యాక్ట్-1885 కింద కేసు నమోదు కావడం ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు.. టెలీగ్రాఫ్‌ చట్టం అంటే ఏంటి?.. ఈ చట్టం అమలుకు ఎలాంటి ఆధారాలు కావాలి?.. అసలు చట్టం ఏం చెప్తోంది?.. అనే అంశాలను ఓ సారి పరిశీలిద్దాం.

వాస్తవానికి.. ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టవిరుద్ధం. అయితే, ఇది అన్ని సందర్భాల్లో కాదు, ఫోన్‌ ట్యాపింగ్‌కు ప్రభుత్వాలకు నిర్దిష్టమైన ప్రక్రియ, సరైన కారణాలు, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అమలు చేసేందుకు వీలు ఉంటుంది. ఉన్నతాధికారుల విజ్ఞప్తి మేరకు.. చట్టానికి లోబడి సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ ఈ అవకాశాన్ని కల్పిస్తారు. దేశ సార్వభౌమ‌త్వం, స‌మ‌గ్రత, శాంతి భ‌ద్రత‌ల ప‌రిర‌క్షణ, విదేశాల‌తో స‌త్సంబంధాల నిర్వహ‌ణ‌తోపాటు ఏదైనా నేరాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం కాల్స్‌ను ఇంట‌ర్‌సెప్ట్ చేయవచ్చు. సాధారణంగా కేంద్రం పరిధిలో ఉండే ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీఐ, ఈడీ, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ , డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ లాంటి రీసెర్చ్ ఏజెన్సీలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి.

ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్-1885 సెక్షన్- 5(2) ప్రకారం.. పలు అంశాల్లో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేసేందుకు అవకాశం ఉంది. అయితే.. దానికి సంబంధించి ఆయా ప్రభుత్వాలు చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో కేంద్ర హోంశాఖ కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి పెద్ద ప్రక్రియే ఉంటుంది. ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ చ‌ట్టం-2000లోని సెక్షన్ 69 కూడా ట్యాపింగ్‌కు సంబంధించి పలు అంశాలను చెబుతోంది. కాల్స్‌ను రికార్డు చేయ‌డానికి లేదా ఇంట‌ర్‌సెప్ట్ చేయ‌డానికి కేంద్ర హోం శాఖ కార్యద‌ర్శి, రాష్ట్ర హోం శాఖ కార్యద‌ర్శి అనుమ‌తి త‌ప్పనిస‌రి. ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు కూడా ప్రత్యేక సాఫ్ట్ వేర్లు రూపొందించి ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడే అవకాశం ఉంది. అలా చేస్తే పౌరుడి గోప్యత హక్కును ఉల్లంఘించటం కిందకు వస్తుంది. అందుకే.. ఇలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్-1885ను బ్రిటీష్‌ కాలంలో రూపొందించారు. ఈ ఇండియ‌న్ టెలిగ్రాఫ్ చ‌ట్టంలోని సెక్షన్ 26 (బి) ప్రకారం.. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు నేరం రుజువు అయితే గ‌రిష్ఠంగా మూడేళ్ల వ‌ర‌కూ జైలు శిక్ష విధిస్తారు.

మొత్తంగా.. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలోనూ అమలు చేయని టెలిగ్రాఫ్ యాక్ట్‌ను ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో అమలు చేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంలోనే తెలంగాణలో తొలిసారి టెలిగ్రాఫ్ యాక్ట్‌ కింద కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. టెలిగ్రాఫ్ యాక్ట్-1885 కింద కేసు నమోదు కావడంతో.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి..!

bottom of page