📰 ఛలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా రైతులు మూడు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీకి చేరుకునేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. పంజాబ్, హర్యానా సరిహద్దులోని శంభు వద్ద వేల మంది మోహరించారు. పంజాబ్‌లోని పలు ప్రాంతాల నుంచి అక్కడికి రైతులు భారీగా చేరుకుంటున్నారు. జాతీయ రహదారి అంతా ట్రాక్టర్లతో నిండిపోయింది.
హర్యానాలోని జింద్ జిల్లా దాతా సింగ్‌వాలా ఖనౌరీ సరిహద్దు వద్ద కూడా రైతులు భారీగా మోహరించి ఉన్నారు. రెండు చోట్లా బారికేడ్లను, ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. పంజాబ్, హర్యానా సరిహద్దులతో పాటు ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా బలగాలను మోహరించారు. డ్రోన్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
రైతుల నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హర్యానా నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గంలో పెద్ద ఎత్తున సిమెంటు బారికేడ్లను ఏర్పాటు చేశారు. కొన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. 144 సెక్షన్ అమలుతోపాటు రోడ్లపై పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేయడంతో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 🌾🚜