top of page

అకాల వర్షంలో వడగండ్ల వాన కారణంగా నష్టపోయిన రైతులు..

అకాల వర్షం, వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.40 వేల నష్టపరిహారం ఇవ్వాలి ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల నష్టపరిహారం నేటికీ రైతులకు అందలేదు రైతు నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో జమచేయాలి.బస్తాకు సుమారు 6 కిలోలు కోత విధించడం గర్హనీయం ధరణితో 40 రకాల సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు.

రాష్ట్రంలో అకాల వర్షం, వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.40 వేల నష్టపరిహారం ఇవ్వాలని, నష్టపరిహారాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) ఎస్.సి విభాగం కన్వీనర్, రైతు నాయకులూ తోట లక్ష్మికాంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా ఇప్పటివరకు రైతు నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన కోరారు. ధరణి పోర్టల్ అస్తవ్యస్తంగా మారిన భూముల సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల సమస్యలపై సోమవారం, సోమాజిగూడ, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అకాల వర్షం, వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన రైతుల పట్ల ప్రభుత్వం పట్టింపులేనితనంతో వ్యవహరిస్తున్నదని, ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నదని, ప్రకటించిన రూ.10 వేల నష్టపరిహారం కూడా నేటికీ రైతులకు అందలేదని లక్ష్మికాంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎకరాకు సుమారు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టి పండించిన పంటలలో దాదాపు 95 శాతం పంటలు నష్టపోయారని, మిగిలిన 5 నుంచి 10 శాతం రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసినా నేటికీ డబ్బులు ఇవ్వలేదని, ఫలితంగా వానాకాలం తొలకరి జల్లులు ప్రారంభమైనప్పటికీ తిరిగి వ్యవసాయం చేసేందుకు వారి వద్ద డబ్బులు లేవని, దీంతో రైతులు తమ జీవనోపాధిని కొల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్, పిట్లం, బిచ్ మండలాలల్లో అకాల వర్షాలతో రైతులు పంటలు నష్టపోయిన వివరాలను ఫొటోలతో సహా తెలియజేస్తూ రాష్ట్రవ్యాప్తంగా రైతులందరి పరిస్థితి ఇదే విధంగా ఉందని చెప్పారు. రైస్ మిల్లర్లు, అధికార యంత్రాంగం కుమ్మక్కై ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఒక మాఫియా ఆపరేషన్ మాదరిగా నిర్వహిస్తున్నారని, ఒక బస్తా ధాన్యానికి కేవలం 640 గ్రాముల సంచి బరువును కొత విధించాల్సి ఉండగా, తేమ తదితర సాకులు చెబుతూ బస్తాకు 4 నుంచి 6 కిలో ధాన్యాన్ని కోత విధిస్తున్నారని, ఫలితంగా రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని నష్టపోతున్నారని ఆయన చెప్పారు. మరోవైపు కనీస మద్దతు ధరను రూ.2060 లు మాత్రమే చెల్లిస్తున్నారని, పైగా సంచుల ఖర్చు, సుతిలీ ఖర్చు పేరుతో రైతును నిండా ముంచుతున్నారని, ఇదేమిటని ప్రశ్నిస్తే రైతులపై దాడులు చేస్తున్నారని, పిట్లం మండలంలో ఇటీవల రైతులపై జరిగిన దాడులే ఇందుకు నిదర్శనమన్నారు. ఇదిలా ఉండగా ధరణి పోర్టల్ రైతులు దాదాపు 40 రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారని, రెవెన్యూ రికార్డులలో ఉన్న కాస్తు రైతులకు యాజామాన్యపు హక్కు కల్పించే 16వ కాలాన్ని ధరణిలో తొలగించారని, దీంతో వందల ఏళ్ల నుంచి రైతులు కాస్తు చేసుకుంటున్న భూములు, వారసత్వపు భూములు ధరణిలో వారి పేర్లమీద లేకుండాపోయాయని, గతంలోని భూస్వాములు, ఇతర మధ్యవర్తులు రైతులపై దాడులు చేస్తూ వారి భూములలోకి రానివ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారని వివరించారు. పెద్దశంకరంపేటలో రైతులు సాగు చేసుకుంటున్న 64 ఎకరాల వారసత్వపు భూములు ధరణిలో రైతుల పేరుతో లేకపోవడంలో ఇటీవల కొంత మంది భూస్వాములు వాటిని కబ్జాచేసి ఇతరులకు అమ్మివేయగా, కొనుగోలు చేసిన ఒక మార్వాడి ఆ భూమిని స్వాధీనం చేసుకుని రైతులను భూములలోకి రానివ్వకపోవడంతో ఘర్షణ జరగడం ఇందుకు ఉదాహరణ అన్నారు. ధరణి వల్ల ఏర్పడుతున్న సమస్యలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, వాటికి దీర్ఘకాలిక పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్నదని ఆయన చెప్పారు.

コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page