సర్కారు దావాఖానాకు వచ్చే పేదరోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. టీ-డయాగ్నస్టిక్స్‌లో టెస్టుల సంఖ్యను ఇప్పటి వరకు 57 ఉండగా.. నేటి నుంచి 134కు పెంచనున్నారు. ఈ పరీక్షలను ఉచితంగా చేయనున్నారు.
తెలంగాణలో వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అందుకు అనుగుణంగా జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకున్నామని పలు సందర్భాల్లో సీఎం, ఇతర మంత్రులు వెల్లడించారు. ఆసుపత్రులను ఆధునీకరించటంతో పాటు నూతనంగా ఆసుపత్రుల నిర్మాణం చేపట్టామని చెబుతున్నారు. తాజాగా.. పేద రోగులకు సర్కారు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. నేటి నుంచి టీ-డయాగ్నస్టిక్స్ (TD) సేవలు మరింతగా విస్తరించనున్నాయి. గవర్నమెంట్ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలనే సంకల్పంతో టీ-డయాగ్నస్టిక్స్‌ను ప్రారంభించారు. టీ-డయాగ్నస్టిక్స్‌లో టెస్టుల సంఖ్యను నేటి నుంచి 134కు పెంచనున్నారు. ఇప్పటి వరకు టీడీల ద్వారా 57 రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు.కొత్తగా అందుబాటులోకి రానున్న టెస్టుల్లో ప్రైవేట్ ల్యాబుల్లో రూ.500 నుంచి రూ.10 వేల వరకు ఖరీదు చేసే పరీక్షలు ఉన్నాయని వైద్యాధికారులు వెల్లడించారు. ఎక్స్‌రే, యూసీజీ, ఈసీజీ, 2డీ ఈకో, మామ్మోగ్రామ్‌తో పాటు ఖరీదైన ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ, తలసేమియా, అనీమియా, కాలా అజార్ హీమోఫీలియా వంటి వ్యాధులను గుర్తించే ప్రొఫైల్స్, HIV టెస్ట్, వైరల్ లోడ్ టెస్టులు వంటివి అందుబాటులోకి రానున్నాయన్నారు. ఈ టెస్టులతో పాటు మరో 8 జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన పాథాలజీ ల్యాబులు, 16 జిల్లాల్లో నెలకొల్పిన రేడియాలజీ ల్యాబులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లోని ఏరియా ఆసుపత్రి నుంచి వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు వీటిని ప్రారంభిస్తారు.2018 జనవరిలో టీ-డయాగ్నస్టిక్స్ సేవలను ప్రభుత్వం ప్రారంభించింది. హబ్ అండ్ స్పోక్ విధానంలో తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. పీహెచ్‌సీ నుంచి అన్నిస్థాయిల దవాఖానల్లో ఉచిత పరీక్షలు ప్రారంభమయ్యాయి.