top of page

కాంగ్రెస్ లో తెగని టికెట్ల పంచాయితీ.. బెట్టువీడని భట్టి, పొంగులేటి..! 🗳️

కాంగ్రెస్ లో లోక్ సభ సీట్ల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. 17 స్థానాలకు గానూ ఇప్పటికే 14 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన స్థానాలపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మం సీట్లపై ఉత్కంఠ నెలకొంది.

ఖమ్మం టికెట్ తన భార్యకు కేటాయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడికి టికెట్ కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఇద్దరికి కాకుండా రామసహాయం రఘరాంరెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటు కరీంనగర్ స్థానంపై కూడా ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ రేసులో అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్న ఉన్నారు. ప్రవీణ్ రెడ్డి హుస్నాబాద్ అసెంబ్లీ స్థానాన్ని వదులుకున్నందన.. ఆయనకే టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం ఖమ్మంలో ఓసీకి టికెట్ కేటాయిస్తే కరీంనగర్ లో బీసీకి  ఇవ్వాలని భావిస్తునట్లు తెలుస్తోంది. 

భట్టి, పొంగులేటి పట్టు వీడకపోవడంతో మధ్య మార్గంగా రామసహాయం రఘురాంరెడ్డి పేరును పరిశీలిస్తున్నారు. రఘురామ రెడ్డి పొంగులేటికి వియ్యంకుడు అవుతారు. పొంగులేటి కుమార్తెను రఘురాంరెడ్డి చిన్న కుమారుడికి ఇచ్చారు. రఘురాంరెడ్డి పెద్ద కుమారుడు హీరో వెంకటేశ్ కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. దీంతో ఖమ్మ సామాజిక వర్గం కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. భట్టి మాత్రం తన భార్య టికెట్ కేటాయించాలని పట్టుబడుతున్నారు. కరీంనగర్ లో బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు. అయితే బండి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కాస్త సెంటిమెంట్ కలిసివస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. బండిని తట్టుకుని గెలిచే అభ్యర్థి ఎంపిక చేయాలని భావిస్తోంది. ప్రవీణ్ రెడ్డి దాదాపు టికెట్ కాన్ఫమ్ చేసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ కు సంబంధించి ఫిరోజ్ ఖాన్ లేదా మరో నేతకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. 

bottom of page