top of page

కారు డిక్కీలో గంజాయి రవాణా.. పోలీసులను చూసి పారిపోతూ బోల్తా

ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి కొనుగోలు చేసి, కారులో తరలిస్తున్న ఓ వ్యక్తి పోలీసులను చూసి పారిపోబోయే ప్రయత్నం చేస్తూ టైరు పేలడంతో దొరికిపోయాడు.

కారులో గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు గమనించి సినిమా తరహాలో వెంబడించారు. దీంతో ఓవర్ స్పీడ్ లో కారును డ్రైవింగ్ చేయగా.. అది కాస్త టైరు పేలిపోయి బోల్తా కొట్టింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి రూ.40 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం సిద్దిపేట గ్రామానికి చెందిన కుంచల జయచంద్రుడు గంజాయి దందాకు తెరలేపాడు.

చుట్టుపక్కల ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి ఎక్కువ ధరతో అమ్మేవాడు. ఇందుకు ప్రత్యేకంగా నెట్ వర్క్ కూడా నడిపించేవాడు. యువకులకు టార్గెట్ గా చేసుకుని ఈ దందా సాగించేవాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే ఆంధ్రప్రదేశ్ లోని రంపచోడవరంలో గంజాయి కొనుగోలు చేశాడు.ఆ సరుకునంతా ఎవరికీ అనుమానం రావొద్దనే ఉద్దేశంతో చిన్నచిన్న ప్యాకెట్లు తయారు చేసి రవాణా చేసేందుకు ప్లాన్ చేశాడు. ఈ మేరకు తను కొనుగోలు చేసిన సుమారు 2 క్వింటాళ్ల గంజాయిని రెండు కిలోల ప్యాకెట్ల చొప్పున వంద ప్యాకెట్లు తయారు చేశాడు. అనంతరం ఆ ప్యాకెట్లన్నీ కారు డిక్కీలో పేర్చుకుని రంపచోడవరం నుంచి బయలుదేరాడు.

ఛేజ్ చేస్తుండగా బోల్తా

గంజాయిని కారు డిక్కీలో పేర్చుకున్న జయచంద్రుడు మహబూబాబాద్ మీదుగా తొర్రూరు వైపు బయలు దేరాడు. ఈ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలకేంద్రానికి సమీపంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీ చేపడుతున్నారు. దీంతో వారిని గమనించిన జయచంద్రుడు భయపడిపోయాడు. వారి నుంచి తప్పించుకోవాలని ఉద్దేశంతో అక్కడి నుంచి కారును వేగంగా నడిపాడు.దీంతో అనుమానం వచ్చిన ఎక్సైజ్ పోలీసులు ఆ కారును వెంబడించారు. తన వెనుకే పోలీసులు వస్తుండటంతో కంగారుపడిపోయి కారు వేగం పెంచాడు. దీంతో లక్ష్మీపురం స్టేజీ సమీపంలోకి రాగానే కారు టైరు పేలిపోయి.. అదుపు తప్పి బండి బోల్తా పడింది. దీంతో పోలీసులు కారులో ఉన్న జయచంద్రుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

అనంతరం కారు తనిఖీ చేయగా.. డిక్కీలో పెద్ద మొత్తంలో గంజాయి కనిపించింది. ఆ తరువాత జయచంద్రుడిని అదుపులోకి తీసుకుని గంజాయి, వాహనాన్ని సీజ్ చేశారు. దాదాపు రూ.40 లక్షల విలువైన 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ రావు తెలిపారు. సమావేశంలో ఏఈఎస్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ కృష్ణ, తొర్రూరు సీఐ భాస్కర్ రావు, ఎస్సైలు హరీశ్, రవలి తదితరులు పాల్గొన్నారు.

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page