లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ వ్యాఖ్య
వాషింగ్టన్, సెప్టెంబర్ 10: అందరికీ సమానమైన అవకాశాలు ఉన్నప్పుడు రిజర్వేషన్లు రద్దు చేయడం గురించి ఆలోచిస్తామని, ఇప్పుడు భారత్‌లో అందరికీ సమాన అవకాశాలు లేవని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌లోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీ విద్యార్థులతో ఆయన మాట్లాడారు. దేశంలో ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీల జనాభా 90 శాతం ఉందని, కానీ దేశంలోని మొదటి 200 వ్యాపారుల్లో, అత్యున్నత న్యాయస్థానాల్లో, మీడియాలో వీరి భాగస్వామ్యం దాదాపు శూన్యమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో 78 మంది కార్యదర్శులు ఉంటే వీరిలో ఒకే ఒక్క గిరిజనుడు, ముగ్గురు దళితులు, ముగ్గురు ఓబీసీలు, ఒక్క మైనారిటీ మాత్రమే ఉన్నారని అన్నారు. కులగణన ద్వారానే దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల స్థితిగతులు తెలుస్తాయని పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై వివాదం
వర్జీనియాలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ‘ఇవాళ భారత్‌లో పోరాటం రాజకీయాల కోసం కాదు. ఒక సిక్కు టర్బన్ ధరించి, గురుద్వారాకు వెళ్లడానికి అనుమతిస్తారా అనే దానిపై పోరాటం జరుగుతున్నది. అన్ని మతాల కోసం జరుగుతున్న పోరాటం ఇది’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పురి తప్పుబట్టారు. రాహుల్ మాట్లాడిన భాష ఖలిస్థానీ వేర్పాటువాది గురుత్వంత్ సింగ్ పన్నూను పోలి ఉందని ఆరోపించారు. ఆయన విదేశాలకు వెళ్లి దేశ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని, ఇది దేశద్రోహమని మరో మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.