బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency). దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరాగాంధీగా కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం గతేడాది నవంబరు 24న విడుదల కావాల్సి ఉండగా.. అనుకోని కారణాల వలన విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత కూడా ఈ సినిమా థియేటర్స్ వద్దకు వెళ్లలేదు. పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. చివరికి ఈ నెల 6న విడుదల చేయనున్నట్లు కంగన ప్రకటించారు.
అయితే, ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఇప్పటి వరకూ సర్టిఫికెట్ ఇవ్వలేదు. చిత్రంపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఈ చిత్రం మరికొన్ని రోజులు ఆలస్యంగా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలలో జాప్యంపై కంగన స్పందించారు. ఈ మేరకు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో ‘దేశం పట్ల నిరాశ చెందాను’ (disappointed with country) అని పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో కంగన మాట్లాడుతూ.. ‘ఇప్పుడు నా సినిమాపై ఎమర్జెన్సీ విధించారు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. మన దేశం పట్ల నేను చాలా నిరాశకు గురయ్యాను’ అని అన్నారు.
భారతదేశ సమగ్రత, ఐక్యత చుట్టూ తిరిగే చిత్రాలను తీసేందుకు తమకు అనుమతి ఉండదని ఈ సందర్భంగా నటి వ్యాఖ్యానించారు. కొన్ని చిత్రాలు తీయడానికి కొంతమందికి మాత్రమే సెన్సార్‌షిప్ ఉంటుందన్నారు. ఇది చాలా అన్యాయమని కంగన పేర్కొన్నారు. తాను ఆత్మగౌరవంతో ‘ఎమర్జెన్సీ’ చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పారు. తన చిత్రానికి సెన్సార్‌బోర్డు సర్టిఫికెట్ ఇవ్వకపోతే తాను కోర్టులో పోరాడటానికైనా సిద్ధమేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
‘ఎమర్జెన్సీ’ చిత్రంలో జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహిమా చౌదరి, మిలింద్ సోమన్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.