top of page
Suresh D

ఎలక్టోరల్ బాండ్స్ పథకం రాజ్యాంగ విరుద్ధం: సుప్రీంకోర్టు🛑📜

 రాజకీయ పార్టీలకు నిధులను అందించే ఎలక్టోరల్ బాండ్స్ పథకంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం సమాచార హక్కును ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.🛑📜

ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. రాజకీయ పార్టీలకు గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి నిధులను అనుమతించే కేంద్ర ప్రభుత్వ ఎలక్టోరల్ బాండ్ పథకం చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. 

ఎలక్టోరల్ బాండ్ల (Electoral bonds) పథకం ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం సమాచార హక్కును ఉల్లంఘించడమేనని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై గత ఏడాది, విచారణ ముగించి, తీర్పును నవంబర్ 2న రిజర్వ్ లో ఉంచింది. ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలు విడదీయలేని విభాగాలని, వాటికి నిధులు ఎలా అందుతున్నాయనే విషయం కూడా ఓటర్లకు తెలియాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు (Supreme Court) తేల్చి చెప్పింది. ఎలక్టోరల్ బాండ్స్ పథకం తో పాటు, ఆ పథకాన్ని అమలు చేయడానికి వీలుగా ఆదాయపు పన్ను చట్టం, కంపెనీల చట్టం మొదలైన వాటిలో చేసిన సవరణలను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ఈ బాండ్లను ఇక జారీ చేయవద్దు

ఈ బాండ్ల (Electoral bonds) ను ఇకపై జారీ చేయవద్దని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కోర్టు ఆదేశించింది. 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2018 లో ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్స్ వ్యవస్థ ద్వారా అత్యధిక లబ్ధిపొందిన భారతీయ జనతా పార్టీకి ఈ తీర్పు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ‘‘ఇది మన ఎన్నికల ప్రజాస్వామ్యంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపే అత్యంత ముఖ్యమైన తీర్పు. రాజకీయ పార్టీలకు ఇంత డబ్బును ఎవరు విరాళంగా ఇస్తున్నారో తెలుసుకోవడానికి పౌరులకు ఉన్న ప్రాథమిక హక్కును ఎలక్టోరల్ బాండ్స్ పథకం ఉల్లంఘిస్తుందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు’’ అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు.

2018 జనవరి 2 నుంచి..

రాజకీయ నిధుల్లో పారదర్శకతను తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగా రాజకీయ పార్టీలకు ఇచ్చే నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా 2018 జనవరి 2న ప్రభుత్వం ఈ ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం నిబంధనల ప్రకారం ఎలక్టోరల్ బాండ్లను భారత పౌరుడు లేదా దేశంలో విలీనమైన లేదా స్థాపించిన సంస్థ ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. ఒక వ్యక్తి ఒంటరిగా లేదా ఇతర వ్యక్తులతో కలిసి ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29ఏ కింద నమోదైన, లోక్ సభకు లేదా రాష్ట్ర శాసనసభకు జరిగిన గత ఎన్నికల్లో పోలైన ఓట్లలో 1 శాతానికి తగ్గకుండా ఓట్లు సాధించిన రాజకీయ పార్టీలు మాత్రమే ఎలక్టోరల్ బాండ్లను పొందడానికి అర్హులు. నోటిఫికేషన్ ప్రకారం ఎలక్టోరల్ బాండ్లను అర్హత కలిగిన రాజకీయ పార్టీ అధీకృత బ్యాంకులో ఖాతా ద్వారా మాత్రమే ఎన్ క్యాష్ చేసుకోవాలి. 

2019 ఏప్రిల్లో ఎలక్టోరల్ బాండ్ల పథకంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించి, దేశంలో ఎన్నికల ప్రక్రియ పవిత్రతపై తీవ్ర ప్రభావం చూపే 'అత్యంత తీవ్రమైన అంశాలను' కేంద్రం, ఎన్నికల సంఘం లేవనెత్తినందున పిటిషన్లపై లోతైన విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల రాజ్యాంగ ధర్మాసనం గత ఏడాది అక్టోబర్ 31న కాంగ్రెస్ నేత జయ ఠాకూర్, సీపీఎం, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) దాఖలు చేసిన నాలుగు పిటిషన్లపై వాదనలు ప్రారంభించింది. ఈ కేసు విచారణ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో నగదును తగ్గించాల్సిన అవసరాన్ని అత్యున్నత న్యాయస్థానం నొక్కిచెప్పింది.🛑📜

Comentarios


bottom of page