top of page
MediaFx

ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్దమైన ప్రధాన పార్టీ నేతలు..🗳️

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిలక ప్రచారానికి నేటితో గడువు ముగియనుండడంతో ప్రచారంలో జోరు పెంచాయి ప్రధాన పార్టీలు. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి పార్థసారధి తరఫున ప్రచారం చేయనున్నారు. అలాగే తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచారానికి అమిత్ షా ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నారు. రెండు సభల్లో పాల్గొని బీజేపీకి మద్దతు ఇవ్వవల్సిందిగా ప్రజలను కోరనున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఉదయం 10 గంటలకు చేవెళ్ల నియోజకవర్గం వికారాబాద్ లో అమిత్ షా జనసభలో పాల్గొంటారు. ఆ తరువాత మధ్యాహ్నం 12 గంటలకు నాగర్ కర్నూల్ నియోజకవర్గం వనపర్తిలో అమిత్ షా బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం ఢిల్లీకి తిరిగి బయలుదేరుతారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 6 గంటల వరకు ఉధృతంగా ప్రచారం చేయనున్నారు బీజేపీ నేతలు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే కడపలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొంటారు. 11:30 కు కడప ఎయిర్ పోర్టుకు చేరుకొని ప్రత్యేక హెలికాఫ్టర్ లో ఇడుపులపాయకు వెళ్లనున్నారు. అక్కడ వైఎస్ఆర్ ఘాట్లో వైఎస్ సమాధికి నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారు. అనంతరం కడప నగరంలోని బిల్టప్ సర్కిల్ వద్ద పుత్తా ఎస్టేట్‎లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరనున్నారు. అనంతరం ప్రచార సభను ముగించుకుని ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు.

ఈసీ ఆదేశాలు..

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కు కేవలం కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. నేటితో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. మే 11 సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇవాళ సాయంత్రం 6 నుంచి ఎల్లుండి సాయంత్రం 6 వరకూ సైలెన్స్ పీరియడ్ గా పరిగణిస్తుంది ఎన్నికల కమిషన్. ఈరోజు సాయంత్రం 6 తరువాత ఎలాంటి ప్రచార కార్యక్రమాలను నిర్వహించకుడదు. రోడ్ షోలు, సభలు, సమావేశాలు, సామాజిక మాధ్యమంలో ప్రచారాలు, పత్రికా ప్రకటనలు అన్నీ ఈరోజు సాయంత్రంతో ముగింపు చెప్పాలి. అలాగే సాయంత్రం 6 తర్వాత స్థానికేతరులు నియోజకవర్గాల్లో ఉండకూడదు. బల్క్ SMS లపై కూడా నిషేధం ఉంటుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ స్లిప్పుల పంపిణీ ప్రక్రియ పూర్తి అయింది. అభ్యర్థి పేరు, పార్టీ పేరు, పార్టీ గుర్తు లేకుండా ఉన్న ఓటర్ స్లిప్పులను మాత్రమే పంపిణీ చేయాలని అభ్యర్థులను ఆదేశించింది ఈసీ. పోలింగ్ కు కేవలం కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉండటంతో ఇవాళ, రేపు తనిఖీలు మరింత ముమ్మరంగా చేపట్టాలని తెలిపింది.

bottom of page