top of page
MediaFx

బీజేపీ మతప్రసంగంగాలు, కాంగ్రెస్ రాజ్యాంగ వ్యాఖ్యలపై ఈసీ షాకింగ్..!

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పరస్పర విమర్శలతో హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు మతపరమైన ప్రసంగాలతో రెచ్చిపోతుంటే, కాంగ్రెస్ రాజ్యాంగం పేరుతో విమర్శలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈసీ ఇవాళ స్పందించింది. బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరికీ చురకలు అంటిస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేలకు తమ స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల నియమావళి ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈసీ నెల రోజుల క్రితమే నోటీసులు ఇచ్చింది. వీటికి స్పందించి ఆయా పార్టీలు తమ స్పందన తెలిపాయి. దీనిపై ఇవాళ స్పందించిన ఈసీ.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లను మతపరమైన ప్రసంగాలు చేయవద్దని ఆదేశించింది. అలాగే విపక్ష కాంగ్రెస్ నేతలు రాజ్యాంగాన్ని రద్దు చేయవచ్చని చెప్పడం మానుకోవాలని ఆదేశించింది. 

ప్రధాని నరేంద్ర మోదీపై ప్రతిపక్షాలు, రాహుల్ గాంధీ, ఖర్గేలపై అధికార పార్టీ ఫిర్యాదులు చేయడంతో ఏప్రిల్ 25న బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులకు ఈసీ నోటీసులు పంపింది. అయితే ఈసీ తమ నోటీసుల్లో ప్రధాని మోడీ పేరును కానీ రాహుల్ గాందీ పేరును కానీ ఎక్కడా పేర్కొనలేదు. కేవలం స్టార్ క్యాంపెయినర్లుగానే పేర్కొంటూ ఈ నోటీసులు పంపింది. ఎన్నికల నియమావళిని వీరు ఉల్లంఘించకుండా చూడాలని తమ ఆదేశాల్లో ఈసీ పేర్కొంది. రెండు పార్టీల అధ్యక్షులకు ఇచ్చిన ఆదేశాలలో, గతంలో తమ నోటీసులకు వారి స్పందన ఆమోదయోగ్యం కాదని ఈసీ పేర్కొంది. దీనికి కారణం రెండు పార్టీలు తమ స్టార్ క్యాంపెయినర్లను సమర్ధించుకోవడమే. ఏప్రిల్ 25న నోటీసులు ఇచ్చి తర్వాత ఎన్ని కోడ్ ఉల్లంఘనలపై ఇరు పార్టీలపై వచ్చిన ఫిర్యాదులను ఈసీ తాజా ఆదేశాల్లో గుర్తుచేసింది. ఇప్పటికీ వారి స్టార్ క్యాంపెయినర్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మానుకోలేదని తెలిపింది.  

bottom of page