top of page
MediaFx

నాపై ట్రోల్స్‌ చేస్తూ మాధురిని బలి చేశారు.. దువ్వాడ శ్రీనివాస్‌ ఆవేదన


తనపై ట్రోల్స్‌ చేస్తూ మాధురిని బలి చేశారని దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. దివ్వల మాధురికి కన్నవారు, అత్తగారు దూరమయ్యారని తెలిపారు. గతంలో మాధురి ఆత్మహత్యయత్నం చేసినప్పుడు తానే కాపాడి ధైర్యం చెప్పానని తెలిపారు. తన వ్యక్తిత్వ హననం జరుగుతోందని మాధురి బాధపడిందని చెప్పారు. డిప్రెషన్‌లో ఎటు వెళ్తున్నారో మాధురికి తెలియదని అన్నారు. డిప్రెషన్‌ మూడ్‌ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆమె చెప్పిందన్నారు. మాధురి కార్‌ యాక్సిడెంట్‌ డ్రామా కాదని దువ్వాడ శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. డ్రామా చేయాలని అనుకుంటే అది నిజమైతే ఏం జరిగి ఉండేదని ప్రశ్నించారు. ఈ యాక్సిడెంట్‌లో మాధురి తలకు గాయమైందని.. సీటీ స్కాన్‌ చేయాలని అన్నారు. తలకు గాయమైతే ఏడాదిలో ఏమైనా జరగొచ్చని వైద్యులు చెప్పారని తెలిపారు. తాను ఎవరికీ భయపడనని, నిర్మొహమాటంగా మాట్లాడతానని దువ్వాడ శ్రీనివాస్‌ అన్నారు. అందుకే తనకు శత్రువులు పెరిగారని తెలిపారు . ఈ వ్యవహారంలో తన భార్య వైపే సమాజం మొగ్గు చూపుతుందని తెలిపారు. కానీ తన జీవితంలో భార్య వాణి ద్వారా ప్రతిక్షణం నరకం చూశానని తెలిపారు. వాణి తండ్రి రాఘవరావు ఎలాంటి వ్యసనపరుడో అందరికీ తెలుసన్నారు. తమ కాపురంలో ఆయనే మెయిన్‌ విలన్‌ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిజానికైతే తాను మాధురిని చూసేందుకు ఆస్పత్రికి వెళ్లాల్సి ఉందని దువ్వాడ శ్రీనివాస్‌ తెలిపారు. కానీ తాను బయటకు వెళ్తే తన ఇంటిని కబ్జా చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను తనపై ఉసిగొల్పిన వాణిది సైకో మనస్తత్వం అని ఆయన ఆరోపించారు. ఆ రోజు ఇంటి డోర్‌ కట్ చేసినవారిమీదనే తనకు కోపమని తెలిపారు. భార్యాపిల్లలపై దాడి చేయాలన్నది తన ఉద్దేశం కాదని చెప్పారు . రెండేళ్ల క్రితమే తన భార్య వాణికి డైవర్స్‌ నోటీసులు ఇచ్చానని పేర్కొన్నారు.

కాగా, దువ్వాడ శ్రీనుతో సంబంధం పెట్టుకుందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో నిన్న పలాస జాతీయ రహదారిపై యాక్సిడెంట్‌ చేసినందుకు గానూ ఆమెపై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరించినందుకు చట్ట ప్రకారం ఆమెపై కేసులు పెట్టారు. నూతన భారతీయ న్యాయ సంహిత సెక్షన్‌ 125 కింద ఈ కేసు నమోదైంది.

bottom of page