top of page
MediaFx

టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ ఔట్..


టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ తప్పుకోనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా స్వయంగా ధ్రువీకరించారు. కొత్త కోచ్ కోసం త్వరలో ప్రకటన జారీ చేయబోతున్నట్టు తెలిపారు. అయితే, మరోసారి కోచ్ పదవి కోసం ద్రావిడ్ దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. గతంలోలాగా ఆయన పదవీ కాలాన్ని ఆటోమేటిక్‌గా పొడిగించే అవకాశం లేదని చెప్పారు. 

‘‘హెడ్‌ కోచ్‌గా రాహుల్ పదవీకాలం జూన్ వరకే. కాబట్టి ఆయన కావాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త కోచ్ భారతీయుడా విదేశీయుడా అన్నది చెప్పలేము. అది సీఏసీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.’’ అని జై షా మీడియాతో వ్యాఖ్యానించారు. ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కోచ్‌ను నియమించే అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు. భారత్‌లో ఇంతకుముందెన్నడూ ఇలా చేయలేదని చెప్పారు. 

టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ 2021 నవంబర్‌లో నియమితులైన విషయం తెలిసిందే. 2023 వన్డే ప్రపంచకప్ తరువాత ఆయన పదవీకాలం ముగియడంతో ఈ జూన్ వరకు రాహుల్ కాంట్రాక్ట్‌ను బీసీసీఐ పొడిగించింది. అయితే, మరోసారి రాహుల్ పదవిని పొడిగించే అవకాశం లేదని జైషా పేర్కొన్నారు. 

ఇంపాక్ట్ ప్లేయర్‌పై వస్తున్న విమర్శల గురించి కూడా జై షా మాట్లాడారు. ఈ విషయాన్ని సంబంధిత వ్యక్తులందరితో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘‘ఇంపాక్ట్ ప్లేయర్ పద్ధతి ఓ ప్రయోగం మాత్రమే. దీంతో, ఇద్దరు కొత్త ప్లేయర్లకు ఐపీఎల్‌లో ఛాన్స్ దక్కుతోంది’’ అని అన్నారు. ఆల్‌రౌండర్ల అభివృద్ధికి ఇంపాక్ట్ ప్లేయర్ వ్యవస్థ అడ్డుపడుతోందన్న విమర్శకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. అంతర్జాతీయ క్రికెటర్ల నుంచి టీమిండియా వెటరన్ రోహిత్ శర్మ వరకూ అనేక మంది ఇంపాక్ట్ ప్లేయర్ విధానాన్ని విమర్శించిన విషయం తెలిసిందే.

bottom of page