సాధారణంగా మనందరికీ ఏదో ఒక సమయంలో తలనొప్పితో బాధపడుతుంటాం. కానీ మానసిక ఒత్తిడి వల్ల ఈ విధమైన తల నొప్పి వచ్చినా.. పెద్దగా పట్టించుకోం. మరి కొందరు మైగ్రేన్‌తో బాధపడుతుంటారు. అందువల్ల వారికి వచ్చే తల నొప్పికి కారణం మైగ్రేన్ అని భావించి లైట్ తీసుకుంటూ ఉంటారు. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి చిన్న ట్యాబ్లెట్ తీసుకుని తమ పనుల్లో మునిగిపోతుంటారు. నొప్పి తగ్గిన తర్వాత, మళ్లీ దాని గురించి పట్టించుకోరు.
కానీ ఈ పద్ధతి అస్సలు మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. తలనొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు. ప్రత్యేకించి ఎటువంటి హెచ్చరిక లేకుండా అకస్మాత్తుగా దాడి చేసే ఈ విధమైన తలనొప్పిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా వాంతులు, కళ్లకు చీకటి కమ్మటం, మైకం వంటి లక్షణాలతో కూడిన తలనొప్పిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదట.
ఎందుకంటే ఇవన్నీ మైగ్రేన్ లక్షణాలు మాత్రమే కాదు బ్రెయిన్ ట్యూమర్ లాంటి చాలా పెద్ద సమస్యకు ఇవే లక్షణాలు కనిపిస్తాయట. కానీ బ్రెయిన్ ట్యూమర్ పదం వినగానే భయపడిపోకండి. నేటికాలంలో ఈ వ్యాధికి అధునాతన వైద్య విధానం ద్వారా సకాలంలో చికిత్స అందించి నయం చేసే అవకాశం ఉంది. ఇందుకు స్వీయ అవగాహన చాలా అవసరం. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలను ఎలా అర్థం చేసుకుంటారు అనే దానిని బట్టి సకాలంలో వైద్యం అందించడానిక అవకాశం ఉంటుంది.
బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలలో ఒకటి తీవ్రమైన తలనొప్పి. కానీ ఈ తలనొప్పి వేరు. ఉదయం మేల్కొన్న తర్వాత తీవ్రమైన తలనొప్పి, జ్వరం, మరే ఇతర కారణం లేకుండానే అకస్మాత్తుగా వణుకు వంటి లక్షణాలు సంభవించవచ్చు. మళ్ళీ కొంత సమయం తరువాత దానికదే స్వయంగా తగ్గుతుంది. అలాగే జీర్ణ సంబంధమైన సమస్య లేకపోయినా వాంతులు అవడం, రోజంతా నిద్రపోవడం, వణుకు, బద్ధకం, మతిమరుపు బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు కావచ్చు. కొన్ని లక్షణాలు కణితి ఉన్న మెదడులోని భాగంపై కూడా కనిపిస్తాయి.
మెదడు కణితులకు నిర్దిష్ట కారణమంటూ ఏదీ లేదు. అయితే మొబైల్ ఫోన్లు, ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల బ్రెయిన్ ట్యూమర్లు వచ్చే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని రసాయనాలు మెదడులో క్యాన్సర్ కణితులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతాయి.