top of page
MediaFx

చైనా, ఫిలిప్పీన్స్ మధ్య చిచ్చురేపిన డీప్‌ఫేక్ వీడియో..


సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్న కొద్దీ.. సరికొత్త ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే సైబర్‌ నేరాలతో సతమతమవుతుండగా.. దీనికి కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) మరింత ఆజ్యం పోస్తోంది. ఈ కృత్రిమ మేధను ఉపయోగించి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. అసలేదో…నకిలీయేదో తేడా తెలియనంతగా ఫొటోలు, వీడియోలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డీప్‌ఫేక్ (DeepFake) కలకలం సృష్టిస్తోంది. తాజాగా, డీప్‌ఫేక్ వీడియో రెండు దేశాల మధ్య చిచ్చు రేపింది. చైనా (China)పై దాడి చేయాలంటూ స్వయంగా ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఆదేశాలు జారీచేసినట్లున్న వీడియో క్లిప్ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇది ఫిలిప్పీన్స్‌లో సంచలనం సృష్టిస్తోంది. 

దేశానికి చైనా నుంచి ఏదైనా ముప్పు పొంచి ఉంటే.. తక్షణమే ప్రతిస్పందించాలని తన సైన్యానికి ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు ఫెర్డినాండ్‌ మార్కోస్‌ జూనియర్ సూచనలు చేసినట్లు ఓ ఆడియో క్లిప్‌ వైరల్ అవుతోంది. దేశానికి హాని జరగడాన్ని తాను సహించలేనని..హక్కుల్ని రక్షించుకునే విషయంలో రాజీ లేదని ఆయన గొంతుకతో ఉన్న క్లిప్‌ను ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రసారం చేసింది. అందులో దక్షిణ చైనా సముద్రంలో మోహరించిన చైనా నౌకలకు సంబంధించిన దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియో వెలుగులోకి రావడంతో ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇది నకిలీదని ప్రజలను హెచ్చరించింది.

‘ఒక దేశానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు సైన్యాన్ని ఆదేశించినట్లుగా వీడియో క్లిప్ ప్రసారం అవుతోంది.. కానీ అలాంటి ఆదేశాలు ఏవీ జారీ చేయలేదు’ ఫిలిప్పీన్స్ ప్రెసిడెన్షియల్ కమ్యూనిటీ కమ్యూనికేషన్ ఆఫీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే, తప్పుడు సమాచార వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. 

ఇక, దక్షిణ చైనా సముద్రం (South China Sea)లో చైనా తీరు వల్ల ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే ఈ వీడియో వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళనకు దారితీసింది.


bottom of page