top of page
Suresh D

తెలంగాణలో కమ్యూనిస్టుల అంతర్మధనం..! ఎమ్మెల్సీ అవకాశం ఎప్పుడో..?

అధికార పార్టీ కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్న సీపీఐ.. దూరంగా ఉండి అంతర్గతంగా సహకారం అందిస్తున్న సీపీఎం పార్టీ చూసేందుకు వేరువేరుగా అనిపించినా ఒకే ఓడలో ప్రయాణం చేస్తున్నట్లు చెబుతున్నాయి.

అధికార పార్టీ కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్న సీపీఐ.. దూరంగా ఉండి అంతర్గతంగా సహకారం అందిస్తున్న సీపీఎం పార్టీ చూసేందుకు వేరువేరుగా అనిపించినా ఒకే ఓడలో ప్రయాణం చేస్తున్నట్లు చెబుతున్నాయి. ఎన్నికలకు ముందు ఒక సీటుతో సర్దుకుపోయిన సీపీఐ, సీట్ల సర్దుబాటు కాక దూరంగా ఉన్న సీపీఎం పార్టీలను ఒకే విధానంతో చూస్తోంది కాంగ్రెస్ పార్టీ.

ఎన్నికల సందర్భంగా సీపీఐ పార్టీకి ఒక ఎమ్మెల్యే రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా ఒక ఎమ్మెల్యే స్థానం ఇవ్వడమే కాకుండా గెలిపించుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఇక గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎమ్మెల్సీల భర్తీ సమయంలో మొదటి దశలోనే సీపీఐ పార్టీకి ఎమ్మెల్సీలలో కనీసం ఒక ఎమ్మెల్సీ అయినా కేటాయిస్తామని ఆనాడు చర్చల సందర్భంగా రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నాయకత్వం కూడా ఆ పార్టీకి హామీ ఇచ్చింది. స్వయంగా అప్పటి పీసీసీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీపీఐ కార్యాలయానికి వెళ్లి రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపి ఎమ్మెల్సీ కేటాయింపుల్లో పూర్తిస్థాయి న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తుంటే మొదటి దశలో వామపక్ష పార్టీలకు ఎమ్మెల్సీ కేటాయింపులు ఉండవు అన్నట్లుగానే తెలుస్తోంది.

ఎమ్మెల్యే కోటాతో పాటు గవర్నర్ కోటాకు సైతం కాంగ్రెస్ పార్టీలోనే తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో మొదటి దశలో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి మద్దతు పలుకుతున్న TJS పార్టీ అధినేత కోదండరాం.. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోనే పార్టీ కోసం పని చేసిన ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేసిన నాయకులకు న్యాయం చేస్తామంటూ ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా ప్రచారం చేస్తున్నారు. దీనిపై వామపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని విమర్శించలేక పార్టీ నేతలను గట్టిగా అడగలేక అంతర్మధనం చెందుతోంది.

సీపీఐ రాష్ట్ర పార్టీ సమావేశంలో జరిగిన సందర్భంలో రాష్ట్ర అదేవిధంగా కేంద్ర కమిటీ నాయకులు మొదటి నుంచి గట్టి పట్టుతో ఉంటే ఎమ్మెల్సీ భర్తీ విషయంలో గట్టిగా అడిగే అవకాశం ఉండేదని ఇప్పుడు కక్కలేక మింగలేక ఉండే పరిస్థితి వచ్చిందని చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఒక అడుగు ముందుకు వేసి జాతీయ నాయకులు నారాయణ బహిరంగంగానే కాంగ్రెస్ – సీపీఐ పొత్తు విషయంలో ఈ అంశాన్ని వ్యక్తం చేశారు. మరి సీపీఐ నాయకుల డిమాండ్లను ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ ఏరకంగా భర్తీ చేస్తుందో చూడాల్సి ఉంటుంది.


bottom of page