ఒడిశాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడటం జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఒడిశా, జార్ఖండ్, కోల్‌కతాలో లిక్కర్ వ్యాపారం చేసే కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది.
గత నాలుగు రోజుల నుంచి డబ్బులను లెక్కించిన ఐటీ అధికారులు రికార్డు స్థాయిలో రూ.353 కోట్ల నగదు, 3 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్, ఒడిశా, కోల్‌కతాలో ఎంపీకి చెందిన ఆస్తులపై ఏకకాలంలో దాడులు నిర్వహించిన ఐటీ అధికారులు పెద్ద మొత్తం నగదును స్వాధీనం చేసుకున్నారు. ఓ ఎంపీ దగ్గర ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. అయితే, ఎంపీని టార్గెట్‌గా చేసుకుని కాంగ్రెస్‌పై కమలం పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రధాని మోదీ దగ్గర నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు అందరూ.. ఈ అంశంపై స్పందిస్తున్నారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నివాసంలో రూ.350 కోట్ల నల్లధనం, సుమారు 3 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మరోసారి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. జనాదరణ పొందిన ‘మనీ హీస్ట్’ క్రైమ్ సిరీస్ డ్రామాను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ కాంగ్రెస్ 70 ఏళ్లుగా దేశాన్ని దోచుకుంటోందంటూ విమర్శించారు. ‘‘భారతదేశంలో, ‘మనీ హీస్ట్’ ఫిక్షన్ ఎవరికి అవసరం.. 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పురాణగాథలు.. లెక్కింపులో ఉన్న దోపిడీలు ఇవే’’.. అంటూ పీఎం మోదీ ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజంట్ మనీ హీస్ట్.. అనే క్యాప్షన్‌తో బీజేపీ షేర్ చేసిన వీడియోను ప్రధాని మోదీ షేర్ చేశారు.