అన్ని పార్టీల చూపు 2024 ఎన్నికలే.. ఎలాగైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చెక్ పెట్టలన్న లక్ష్యంతో కాంగ్రెస్ నేతృత్వంలోని మిత్రపక్షాలు ముందుకు సాగుతున్నాయి.
దీనిలో భాగంగా పాట్నా వేదికగా తొలి సమావేశం విజయవంతం అవ్వడంతో.. విపక్షపార్టీలు మరో ముందడుగు వేశాయి.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల బూస్ట్‌తో బెంగళూరు వేదికగా కాంగ్రెస్.. రెండో సమావేశాన్ని నిర్వహిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా కర్ణాటకలోని బెంగళూరులో సోమవారం, మంగళవారం విపక్షాల సమావేశం జరగనుంది. నితీష్ నేతృత్వంలో జరిగిన ప్రతిపక్ష ఐక్యత సమావేశానికి ఇప్పటికే మొత్తం 25 పార్టీల మద్దతును కూడగట్టింది. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్‌ను స్థాపించే ప్రయత్నాలలో భాగంగా బెంగళూరులో జరిగే ఈ సమావేశానికి కనీసం 26 ప్రతిపక్ష పార్టీల నాయకులు హాజరుకానున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిని ఎలా ఓడించాలి.. ఫ్రంట్ చైర్మన్ ఎవరు..? పార్టీల ఉమ్మడి కార్యచరణ, తదితర అంశాలపైనే చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచార వ్యూహం.. విపక్షాల కూటమి పేరు ఖరారు, కనీస ఉమ్మడి కార్యచరణ, కూటమిలో తలెత్తే పలు సమస్యలపై చర్చించేందుకు సమావేశాలు నిర్వహించేందుకు పలు కమిటీల ఏర్పాటు, బీజేపీకి వ్యతిరేకంగా కనీసం 80 శాతం లోక్‌సభ స్థానాల్లో ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిని ఎలా నిలబెట్టాలి, రాష్ట్రాల్లో పొత్తులు ఎలా ఉండాలి, కీలక నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఎలా పంపిణీ చేయాలి అనే విషయాలపై కూడా చర్చ జరగవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ఢిల్లీ ఆర్డినెన్స్, UCC, ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై కూడా చర్చ నిర్వహించనున్నారు. 🗣️📚✍️👥