top of page

కాంగ్రెస్ అధిష్టానం సంచలన నిర్ణయం.. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి..🗓️🏛️

సీఎల్పీ నేతగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ప్రకటించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతగా ఎన్నుకోవడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 119 నియోజకవర్గాల్లో 64 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే, సీఎం ఎవరన్న దానిపై కొనసాగుతున్న ఉత్కంఠ నడుమ కాంగ్రెస్ పార్టీ.. సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎల్పీ నేతగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ప్రకటించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతగా ఎన్నుకోవడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలు, సీనియర్లతో చర్చలు.. ఇలా చాలా కసరత్తుల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి పేరును ప్రకటించింది. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ ప్రెస్ మీట్ వివరాలను వెల్లడించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క సమక్షంలోనే కేసీ వేణుగోపాల్ రేవంత్ పేరును ప్రకటించారు.

డిసెంబర్ 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత.. మరుసటి రోజు 4న (సోమవారం) గచ్చిబౌలి ఎల్లా హోటల్లో 40 నిమిషాల పాటు సాగిన సీఎల్పీ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పరిశీలకులు ఏకవాక్య తీర్మానాన్ని ఢిల్లీకి పంపించారు. సీఎం రేసులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి.

సీఎల్పీ భేటీకి పరిశీలకులుగా డీకే శివకుమార్‌తో పాటు దీప్‌దాస్‌ మున్షీ, జార్జ్‌, అజయ్‌, మురళీధరన్‌ హాజరయ్యారు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు తీర్మానం చేసినట్లు డీకే శివకుమార్ చెప్పారు. అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో అధిష్టానంతో భేటీ అయి.. అభిప్రాయాలను తెలిపారు. అనంతరం అధిష్టానం సీఎం పేరును ప్రకటించింది.

అధిష్టానం నిర్ణయం మేరకు సీఎం అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సంప్రదాయం ప్రకారం ఇప్పటికే గవర్నర్‌తో సమావేశమైన కాంగ్రెస్‌ నేతలు.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిదిగా విజ్ఞప్తి చేశారు. మరోవైపు ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే రాజ్‌భవన్‌ అధికారులు ఏర్పాట్లు చేశారు.🗓️🏛️

bottom of page