top of page
MediaFx

చిరంజీవి సూచన.. కదిలిన ఫిల్మ్ ఛాంబర్.. త్వరలోనే కమిటీ


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డుల మీద స్పందించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తరుపున గద్దర్ అవార్డుల కార్యక్రమంకి సానుకూలంగా ఉన్నామని, కానీ ఇండస్ట్రీ నుంచి ఇంత వరకు ఎవ్వరూ ముందుకు వచ్చి మాట్లాడలేదని సీఎం అన్నారు. ఇక సీఎం అంతటి వ్యక్తి అలా అనడంతో మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అయ్యారు. ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లను ఈ విషయం మీద చర్చించమని కోరారు. దీంతో ఫిల్మ్ ఛాంబర్ రియాక్ట్ అయింది. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్, కార్యదర్శులు దామోదర్ ప్రసాద్, శివప్రసాద రావుల పేరు మీదుగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అందులో ఏముందంటే.. తెలంగాణ రాష్ట్రంలో ఫిలిం ఇండస్ట్రీ మరింత అభివృద్ధికి తోడ్పడుతున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ విషయం మీద తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో అవార్డ్స్‌కు సంబంధించిన కమిటీ గురించి చర్చించడం జరిగిందని, దీని మీద తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి వారు ఒక కమిటీని నియమించి విధివిధానాలను తయారు చేసి ప్రభుత్వానికి త్వరలోనే అందజేస్తామని ప్రకటించారు. నంది అవార్డులు, గద్దర్ అవార్డులపై టాలీవుడ్ ముందడుగు వేసినట్టుగానే కనిపిస్తోంది. మరి ఈ రెండు అవార్డులను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా నిర్వహిస్తాయో చూడాలి. వీటిపై ఏ అవార్డులను ముందుగా ప్రకటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి అయితే టాలీవుడ్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. గద్దర్ అవార్డుల మీద రేవంత్ రెడ్డి ముందుగా స్పందించడం అభినందనీయం.

bottom of page