top of page
MediaFx

వేసవిలో ప్రతిరోజు చల్లటి నీటితో స్నానం చేస్తే ఏమవుతుంది..?


చాలామంది వర్షాకాలం, శీతాకాలంలో వేడి నీళ్లతో స్నానం చేస్తారు. ఇక ఎండాకాలం వచ్చిందంటే ఉష్ణ తాపాన్ని తట్టుకోలేక చన్నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటారు. ఎండాకాలంలో ప్రతిరోజు చన్నీళ్ళతో స్నానం చేస్తే ఏమవుతుంది? స్నానం చేయడం మంచిదేనా? చన్నీళ్ళ స్నానం వలన జుట్టు ఊడిపోతుందా? ఏమైనా అనారోగ్యాలు వస్తాయా? వంటి వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. 

వేసవికాలంలో చన్నీళ్ళతో స్నానం చేయడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, ప్రతిరోజు చన్నీళ్ల స్నానం చేయడం ఎంతో మంచిదని చెబుతున్నారు వైద్యనిపుణులు. చల్లటి నీటిలో స్నానం చేయడం వల్ల శరీరంలో ఉండే వాపులు, కండరాల నొప్పులు తగ్గుతాయని, రక్త ప్రసరణ మెరుగు పడుతుందని చెబుతున్నారు. అంతేకాదు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని, ఫలితంగా ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు వైద్యనిపుణులు. 

చన్నీళ్ల స్నానం చేస్తే ఏదో జరిగిపోతుందన్న అపోహ వద్దని, చన్నీళ్ల స్నానం చేయడం వల్ల నాడీ వ్యవస్థ ప్రేరేపితం అవుతుందని చెబుతున్నారు. ఇది శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుందని సూచిస్తున్నారు. వేసవిలో చన్నీళ్ళ స్నానం ఒత్తిడి కలిగించే హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుందని సూచిస్తున్నారు. ఐదు నిమిషాల పాటు చన్నీటి స్నానం చేయడం వల్ల డిప్రెషన్ నుంచి ఉపశమనం లభిస్తుంది . ఇది ఫీల్ గుడ్ ఎండార్ఫిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. 

చన్నీటి స్నానం చేయడం వల్ల మన హృదయ స్పందన రేటు కరెక్ట్ గా మారుతుందని, రక్తపోటు తగ్గుతుందని, ఆక్సిజన్ సక్రమంగా తీసుకోగలమని చెబుతున్నారు. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, వేసవిలో రోజు చన్నీళ్ళతో స్నానం చేస్తే ఎంతో మంచిదని సూచిస్తున్నారు. 

చల్లని నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరంలోని ల్యూకోసైట్లు ప్రేరేపితం అవుతాయి. ఇవి మనల్ని సాధారణ అనారోగ్యాల నుండి కాపాడతాయి. చన్నీటి స్నానం చేయడం వల్ల చర్మ రంద్రాలను బిగుతుగా చేసి ఆయిల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. చర్మాన్ని, జుట్టు పొడిబారకుండా కాపాడుతుంది. 

bottom of page