top of page
MediaFx

నేడు తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం


హిమగిరులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర నేడు (మే 10) ప్రారంభం కానుంది. ఏటా అక్షయ తృతీయ రోజున ప్రారంభమయ్యే ఈ యాత్ర.. ఆరు నెలల పాటు కొనసాగుతోంది. ఉత్తరాఖండ్‌‌లోని గర్వాల్ హిమాలయ శ్రేణుల్లో ఉండే గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌‌ ఆలయాల సందర్శనను చార్‌ధామ్‌ యాత్రగా పిలుస్తారు. దీపావళి మర్నాడు యమద్వితీయ (కార్తీకమాసం) రోజున మూసివేసే ఈ నాలుగు ఆలయాలను.. అక్షయ తృతీయ (వైశాఖ శుక్ల తదియ) రోజున తెరుస్తారు. శీతాకాలంలో మంచు కారణంగా మూసి ఉండే ఈ ఆలయాలను దర్శించుకోడానికి భక్తతులను అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో ఆరు నెలల తర్వాత అశేష భక్తుల సందర్శనార్ధం కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి శుక్రవారం తెరుచుకున్నాయి.

ముందుగా కేదారినాథ్, యమునోత్రి ఆలయాలు పూజాదికాల కోసం ఉదయం 7 గంటలకు తెరుచుకున్నాయి. గంగోత్రి ఆలయం మధ్యాహ్నం 12.20 నిమిషాలకు తెరవనున్నారు. చార్‌ధామ్‌లో భాగమైన బద్రీనాథ్ ఆలయం మే 12న తెరుచుకోనుంది. బద్రీ నారాయణుడి దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు బద్రీనాథ్ కేదారినాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) మీడియా ప్రతినిధి హరీష్ గౌర్ వెల్లడించారు. ఇక, కేదారేశ్వర ఆలయాన్ని 20 క్వింటాళ్ల పుష్పాలతో అలంకరించారు. అంతకు ముందు 47 కి.మీ. దూరంలో ఉన్న ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్‌ ఆలయంలో పూజలు అందుకున్న కేదారేశ్వర పంచముఖ విగ్రహాన్ని వాలంటీర్లు పాదరక్షలు లేకుండా కాలి నడకన భుజాలపై మోసుకుని కేదార్‌నాథ్ చేరుకున్నారు. ఆలయాన్ని మూసివేసిన తర్వాత ఆరు నెలల పాటు ఉఖిమఠ్‌లో ఆదిదేవుడికి పూజలు నిర్వహిస్తారు.

అటు, ఛార్‌ధామ్ యాత్ర ఆరంభ సూచకంగా గురువారం రిషికేష్ నుంచి 135 వాహనాలలో దాదాపు 4 వేల మంది భక్తుల బృందం బయలుదేరి వెళ్లింది. ఈ ఏడాది ఛార్‌ధామ్ దర్శనం కోసం యాత్రికులు పెద్ద సంఖ్యలో వస్తారని భావిస్తున్నట్టు ఉత్తరాఖండ్ మంత్రి ప్రేమ్‌చంద్ అగర్వాల్ వెల్లడించారు. దేశ విదేశాల నుంచి వచ్చే యాత్రికుల కోసం పక్కాగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. చార్‌ధామ్ ఆలయాలు శైవ, వైష్ణవంంతో పాటు జీవనదులు గంగ, యమునలకు ప్రతీకంగా ఉంటాయి. ఆధ్యాత్మికత, అంతకు మించిన ప్రకృతి రమణీయత సందర్శన కోసం ఎంత కష్టమైనప్పటికీ యాత్రికులు వస్తుంటారు.

bottom of page