top of page
Suresh D

‘చంద్రముఖి 2’ రివ్యూ రాఘవ లారెన్స్ భయపెట్టాడా లేదా..?

రాఘవ లారెన్స్ , పి.వాసు కాంబినేషన్‌లో తెరకెక్కిన హార్రర్ కామెడీ ‘చంద్రముఖి 2’ . 2004లో విడుదల అయి తమిళనాట ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘చంద్రముఖి’ సినిమాకు ఇది సీక్వెల్. మొదటి భాగంలో రజనీకాంత్ హీరోగా నటించగా, సీక్వెల్‌లో హార్రర్ సినిమాల స్పెషలిస్ట్ రాఘవ లారెన్స్ కనిపించనున్నారు. ‘చంద్రముఖి 2’లో కంగనా రనౌత్ టైటిల్ రోల్‌లో నటించారు. ఈ సినిమాపై తెలుగు, తమిళ భాషల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది?

సినిమా ప్రారంభంలో రాఘవ లారెన్స్ యాక్షన్ ఎపిసోడ్ కాస్త భయపెట్టినా తర్వాత మళ్లీ అటువైపు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. ప్రథమార్థంలో కథ చాలా నెమ్మదిగా సాగుతుంది. వడివేలు కామెడీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఫస్టాఫ్‌లో రాఘవ లారెన్స్ దయ్యాల్లోని రకాల గురించి వడివేలుకు ఎక్స్‌ప్లెయిన్ చేసే సీన్ దాదాపు ఐదు నుంచి 10 నిమిషాల మధ్యలో ఉంటుంది. మల్లీశ్వరిలో వెంకటేష్, సునీల్‌కు కథ చెప్పే ఎపిసోడ్‌ను ఇది గుర్తు చేస్తుంది. కానీ ఈ సీన్ నవ్వించకపోగా విసిగిస్తుంది. అలాగే మొదటి భాగంలో ఉన్న పెయింటర్, దొంగ స్వామీజీలుగా వచ్చే మనోబాల పాత్రలను ఇందులో కూడా రిపీట్ చేశారు. ఈ రెండు పాత్రలూ ఒకే సీన్‌లోనే వచ్చినా నోస్టాల్జిక్ ఫీలింగ్‌ను ఇవ్వవు, నవ్వించవు, భయపెట్టవు. ఉన్నాయంటే ఉన్నాయంతే. ఇంటర్వెల్ వైపు సాగే కొద్దీ కథనంలో వేగం పెరుగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగా వర్కవుట్ అవుతుంది. అక్కడ వచ్చే ట్విస్ట్‌ని ముందే గెస్ చేయగలిగినా... ఆ పాత్రలోని నటి పెర్ఫార్మెన్స్‌తో మెప్పిస్తారు.

సెకండాఫ్ ప్రారంభంలో మళ్లీ గ్రాఫ్ కిందకి వచ్చేస్తుంది. రాఘవ లారెన్స్, మహిమా నంబియార్‌ల లవ్ ట్రాక్, పాటలు విసిగిస్తాయి. మొదటి భాగంలో రజనీకాంత్, నయనతారల ట్రాక్ తరహాలో నడిపిద్దాం అనుకున్నా కానీ అది సరిగ్గా వర్కవుట్ అవ్వలేదు. ఎప్పుడైతే వేటయ్య రాజు ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుందో అక్కడ నుంచి మెల్లగా వేగం పుంజుకుంటుంది. ‘చంద్రముఖి’ మొదటి భాగంలో ఉండే ఫ్లాష్‌బ్యాక్‌కి కొత్త కోణం అద్ది చూపిద్దాం అనుకున్నారు. కానీ అది సినిమా లెంత్‌ను కూడా పెంచేసింది. ఫ్లాష్‌బ్యాక్‌లో పెద్దగా పస లేకపోయినా పర్లేదనిపించిందంటే దానికి రాఘవ లారెన్స్, కంగనా రనౌత్‌ల పెర్ఫార్మెన్స్ కారణం. క్లైమ్యాక్స్‌ను మళ్లీ మొదటి భాగం తరహాలోనే ముగించారు. చివర్లో ‘చంద్రముఖి 3’కి ఇచ్చిన లీడ్ మరీ సిల్లీగా అనిపిస్తుంది.

‘చంద్రముఖి’ని దృష్టిలో పెట్టుకోకుండా ఒక సాధారణ హార్రర్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్‌తో వెళ్తే ‘చంద్రముఖి 2’ ఒకసారి చూడవచ్చు. మొదటి భాగం స్థాయిలో అంచనాలు పెట్టుకుంటే మాత్రం నిరాశ పడతారు. సీక్వెల్ అంటే మొదటి భాగాన్ని కొనసాగించాలి కానీ దాన్నే వేరే నటులతో తీయడం కాదు కదా అనే ఆలోచన కూడా వస్తుంది. ‘చంద్రముఖి 2’ హిట్ అయితే ‘చంద్రముఖి 3’ రజనీతో మళ్లీ చేస్తామని పి.వాసు చెప్పారు. మరి ఈ సినిమా చూశాక రజనీ ఆ సాహసం చేస్తారో లేదో చూడాలి మరి!

bottom of page