తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారి పోరాట స్ఫూర్తిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) స్మరించుకున్నారు. తెలంగాణ మహిళాశక్తికి, బహుజన ధీరత్వానికి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన ఉద్యమంలో వారి పోరాట స్ఫూర్తి ఇమిడివున్నదని తెలిపారు. ప్రజావ్యతిరేక పాలనపై ధిక్కారాన్ని ప్రకటించిన చాకలి ఐలమ్మ ప్రతిఘటనా తత్వం ఎల్లవేళలా ఆదర్శమని కేసీఆర్ చెప్పారు. ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగించేదిశగా వారి జయంతిని తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. మన తెలంగాణ వీర వనిత..
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని హరీశ్ రావు (Harish Rao) అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించారు. నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆ యోధురాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తి అని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ త్యాగాలకు గుర్తుగా వారి జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించి అమలు చేసింది. భావితరాలకు ఆ మహనీయురాలి చరిత్ర తెలువాలని పాఠ్యాంశంగా పెట్టి గౌరవించిందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.