సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో రాత్రి వేళల్లో మళ్లీ చైన్‌స్నాచింగ్‌లు పెరుగుతున్నాయి. మూడు నెలల కిందట నగరంలో రాత్రి అయ్యిందంటే చాలు స్నాచింగ్ ముఠాలు హాల్‌చల్ చేశాయి. ఆ ముఠాలను కట్టడి చేసేందుకు పోలీసులు డెకాయి ఆపరేషన్లు నిర్వహిస్తూ.. స్నాచర్లపై కాల్పులు కూడా జరిపి భయాన్ని సృష్టించారు. స్నాచర్లను అరెస్ట్ చేస్తూ, కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. దీంతో గడిచిన మూడు నెలలు నేరాలు జరగలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో స్నాచింగ్ ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఈ సారి మాత్రం ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారు. ఎక్కడ స్నాచింగ్ జరిగినా.. సంబంధిత స్థానిక ఏసీపీ, ఇన్‌స్పెక్టర్, సెక్టార్ ఎస్సైలపై ఉన్నతాధికారులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఇటీవల ఎస్‌ఆర్‌నగర్ పరిధిలో రాత్రి సమయంలో ఓ స్నాచింగ్ జరిగింది. అదే ఠాణా పక్కన జరిగిన మరో ఘటనలో సెల్‌ఫోన్ స్నాచింగ్ జరిగింది. వీటిపై నగర పోలీస్ కమిషనర్ స్పందిస్తూ.. ఏసీపీపై సీరియస్ అయినట్లు సమాచారం. ఈ మేరకు ఆ ఏసీపీని కేంద్ర కార్యాలయానికి కూడా అటాచ్ చేశారు. ఒంటరిపై.. స్నాచర్ పంజా!
రాత్రి వేళల్లో ఒంటరిగా నడుచుకుంటూ, బైక్‌పై వెళ్తుంటే ఏ స్నాచర్ ఎక్కడి నుంచి దాడి చేస్తాడోనన్న భయం ప్రజల్లో మొదలైంది. ఇటీవల తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బైక్‌పై వెళ్తూ.. ఇద్దరు స్నాచర్లు సెల్‌ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. చార్మినార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మాట్లాడుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి సెల్‌ఫోన్ లాక్కొని పరారయ్యారు. ఈ రెండు ఘటనల్లోనూ నిందితులను పోలీసులు పట్టుకున్నారు. స్నాచింగ్ ఘటనలు జరగకుండా యాంటీ స్నాచింగ్ టీమ్‌లను రంగంలోకి దింపినా.. తిరిగి స్నాచింగ్ ఘటనలు పెరిగిపోతుండటంతో స్థానిక పోలీసులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విజిబుల్ పోలీస్ ఎక్కడ..!
స్నాచింగ్ ఘటనలపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నా.. క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది మాత్రం తమ దారి తమదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్‌తో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టడి చేయవచ్చు. కాగా.. స్నాచింగ్ ముఠాలను పట్టుకునేందుకు డెకాయి ఆపరేషన్లు చేస్తూ యాంటీ స్నాచింగ్ బృందాలు తిరుగుతున్నాయి. ఈ బృందాలే స్నాచర్లను పట్టుకుంటున్నాయి.
క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది మాత్రం తమకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో విజిబుల్ పోలీసింగ్ అనే విషయాన్ని మర్చిపోయారు. రాత్రి వేళల్లో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. క్షేత్ర స్థాయిలో రోజు వారీగా సిబ్బంది ఏమి చేస్తున్నారు.. వంటి వివరాలు నమోదు చేసే డెయిలీ రిపోర్టును చూసే అధికారులు లేకపోవడంతో పెట్రోలింగ్ వ్యవస్థతో పాటు బ్లూకోల్ట్స్, ఫుట్ పెట్రోలింగ్ సిబ్బంది అంతా నిద్రావస్తలోకి వెళ్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.