top of page
MediaFx

ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..


నగరాల్లో ఆఫీసులకు వెళ్లడం అంటే కష్టంతో కూడుకున్న అంశం. ఉదయం లేచి, అన్ని పనులు చేసుకొని బయలుదేరి వెళ్తే ఏ రెండు గంటలకు కానీ ఆఫీసుకు చేరుకొని పరిస్థితి. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌, పుణె, బెంగళూరు లాంటి పట్టణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఈ నగరాల్లో ఉండే ట్రాఫిక్‌ కష్టాలు మాటల్లో చెప్పలేం. ఆఫీసు పక్కన ఇంటిని అద్దెకు తీసుకుందామంటే రెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో చాలా మంది దూరంగా అద్దెలు తీసుకొని కష్టమైనా ఆఫీసుకు వస్తుంటారు. ఇక మరికొందరైతే ఆలస్యమవుతుందన్న కారణంతో క్యాబ్‌లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఆ క్యాబ్ ఛార్జీలు ఏకంగా ఇంటి అద్దెను మించిపోతే ఎలా ఉంటుంది. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ యువతి తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది. బెంగళూరులో ట్రాఫిక్‌ ఎలా ఉంటుందో దేశమంతా తెలిసిందే. ముఖ్యంగా ఆఫీసు సమయాల్లో ఉద్యోగులు ట్రాఫిక్‌లో నరకం చూస్తుంటారు. ఈ క్రమంలోనే వన్షిత అనే ఉద్యోగిని తనకు ఎదురైన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకుంది. వన్షిత అనే ఉద్యోగిని రోజూ ఆఫీసుకు వెళ్లే క్రమంలో ఉబర్‌ క్యాబ్‌ను ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలోనే అసలు తను క్యాబ్‌కు ఎంత ఖర్చు చేస్తుందో అన్న విషయాన్ని తెలుసుకోవాలనుకుంది. దీంతో క్రెడ్‌ యాప్‌లో క్యాబ్‌ ఛార్జీలను ట్రాక్‌ చేసింది. జులై 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆమె మొత్తం 73 ట్రిప్స్‌ తిరిగింది. దీనికి అయిన అయిన ఖర్చు అక్షరాల రూ. 16 వేలకుపైనే కావడం గమనార్హం. దీంతో ఒక్కసారి కంగుతిన్న వన్షిత.. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. తన ఇంటి అద్దెలో సగం కంటే ఎక్కువ క్యాబ్‌కే ఖర్చవుతోంది అంటూ పోస్ట్ చేసింది. అయితే బెంగళూరులో కాబట్టి ఈ మొత్తం ఇంటి అద్దెలో సగం కంటే ఎక్కువ. అదే ఒకవేళ హైదరాబాద్‌లో అయితే ఇంటి అద్దె కంటే ఎక్కువని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక వన్షిత చేసిన పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. తాము ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొంటున్నామని చెప్పుకొచ్చారు. మరికొందరైతే ఆ క్యాబులకు చెల్లించే బదులు ఎంచక్కా ఒక కారు కొనుక్కొని ఈఎమ్‌ఐలు చెల్లించవచ్చు కదా అని కామెంట్స్‌ చేస్తున్నారు.



bottom of page