ప్రతిష్ఠాత్మక పారిస్ పారాలింపిక్స్ గేమ్స్ అట్టహాసంగా ముగిశాయి. ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులను అలరించిన పారాలింపిక్స్‌కు ఆదివారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) తెరపడింది. చారిత్రక స్టేట్ డీ ఫ్రాన్స్ స్టేడియం వేదికగా పారాలింపిక్స్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. దాదాపు 60వేల మంది ప్రేక్షకుల సమక్షంలో వైవిధ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలు కట్టిపడేశాయి.
ఓవైపు వరుణుడు అంతరాయం కల్గించినా.. ఫ్రాన్స్‌కు చెందిన టాప్-20 డీజేలు రూపొందించిన పాటలతో స్టేడియం హోరెత్తిపోయింది. అథ్లెట్లు చిరకాలం గుర్తిండిపోయేలా ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ జీన్ మిచెల్ జారె, కాసియస్ పాటలను అభిమానులు బాగా ఆస్వాదించారు.
అంతకముందు జరిగిన మార్చ్‌పాస్ట్‌లో 169 దేశాలకు చెందిన పారా అథ్లెట్లు జాతీయ జెండాలు పట్టుకుని ముందుకు నడిచారు. భారత్ తరఫున హర్విందర్‌సింగ్, ప్రీతిపాల్..పతాకధారులుగా వ్యవహరించారు. పారిస్ మేయర్ అన్నె హిడాల్గో పారాలింపిక్స్ జెండాను అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు అండ్రూ పార్సన్‌కు అందజేయగా, అతను లాస్ ఎంజెల్స్ మేయర్ కారెన్ బస్‌కు ఇచ్చారు. ముగింపు వేడుకల్లో పారాలింపిక్స్ జెండాను అందుకున్న తొలి నల్లజాతి మేయర్‌గా కారెన్ నిలిచారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మక్రాన్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.