top of page
MediaFx

తమ్ముడూ.. ట్రైన్‌తో ఇలాంటి పరాచకాలు అవసరమా?


డిజిటల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రీల్స్‌కు (Reels) ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. రీల్స్ చేసి వాటిని వైరల్ (Viral Reels) చేసేందుకు కొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం అవసరమైతే తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టేస్తున్నారు. ముఖ్యంగా యువత రీల్స్ కోసం చేసే సాహసాలు (Dangerous stunts) చూస్తుంటే ఆందోళన కలగడం సహజం. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో కుర్రాడు కదులుతున్న రైలుతో (Moving Train) ప్రాణాంతక సాహసం చేశాడు.


ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక రైలు ప్లాట్‌ఫామ్ నుంచి బయలుదేరింది. కాస్త వేగం అందుకున్న తర్వాత ఓ కుర్రాడు వచ్చి రైలు గేటును పట్టుకుని బయటకు వేలాడుతూ ముందుకు వెళ్లడం ప్రారంభించాడు. రైలు గేటు పట్టుకుని ప్లాట్‌ఫామ్‌పై చాలా దూరం వరకు జారుకుంటా వెళ్లాడు. రైలు ప్లాట్‌ఫామ్ అంచుకు చేరుకున్న తర్వాత రైలు లోపలికి ప్రవేశించాడు. అతడి స్టంట్‌ను ఆ రైలులో ఉన్న అతడి స్నేహితుడు వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ప్రమాదకర స్టంట్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయి రైల్వే పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ వీడియోను ముంబైలోని ఓ లోకల్ రైల్వే స్టేషన్‌లో చిత్రీకరించారు. స్పందించిన రైల్వే పోలీసులు ఆ కుర్రాడిని పట్టుకొని కఠినంగా శిక్షించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ``ఒకరిని కఠినంగా శిక్షిస్తే మిగతా వారికి బుద్ధి వస్తుంది``, ``ప్రజలు తమ ప్రాణాలను చాలా చులకనగా భావిస్తారు`` అంటూ కామెంట్లు చేశారు.



Commenti


bottom of page