top of page
MediaFx

ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు ఇండియన్లను అరెస్ట్ చేసిన కెనడా


ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు ముగ్గురు ఇండియన్లను అరెస్టు చేశారు. నిజ్జర్ హత్యకు సహకరించారనే ఆరోపణలతో శుక్రవారం ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. వారంతా నాన్ పర్మనెంట్ రెసిడెంట్స్ గా నాలుగైదేళ్ల నుంచి కెనడాలో ఉంటున్నారని వివరించారు. నిందితులు కరణ్ బ్రార్ (22), కమల్ ప్రీత్ సింగ్ (22), కరణ్ ప్రీత్ సింగ్ (28) ఫొటోలను మీడియాకు రిలీజ్ చేశారు.కెనడా పౌరసత్వం పొందిన నిజ్జర్ 2023 జూన్ 18న సర్రేలోని ఓ గురుద్వారా ముందు హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో ఆరోపణలను భారత విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ కెనడా ప్రధాని ట్రూడోపై మండిపడింది. తగిన ఆధారాలు అందజేస్తే విచారణకు సహకరిస్తామని వెల్లడించింది. తాజాగా ఈ కేసులో ముగ్గురు భారతీయులను కెనడా పోలీసులు అరెస్టు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


bottom of page