ముకేశ్ తండ్రి ధీరూభాయ్ అంబానీ ఏం చేసేవారంటే..
ముకేశ్ అంబానీ పుట్టుకతోనే ధనవంతుడు కాదు. ఆయన తండ్రి ధీరూభాయ్ అంబానీ, తల్లి కోకిలాబెన్ అంబానీ బతుకుదెరువు కోసం యెమన్‌కు వెళ్లినప్పుడు అక్కడే జన్మించాడు. ముకేశ్ అంబానీ జన్మించినప్పుడు ధీరూభాయ్ అంబానీ యెమెన్‌లోని ఓ గ్యాస్ స్టేషన్‌లో పనిచేసేవారు. ముకేశ్ అంబానీ పుట్టిన తర్వాత ఏడాదికి ధీరూభాయ్ అంబానీ కుటుంబంతో సహా భారతదేశానికి తిరిగి వచ్చారు. ముంబైలోని ఒక చిన్న అపార్ట్‌మెంటులో కాపురం పెట్టాడు. అప్పుడు ధీరూభాయ్ చేతిలో కేవలం రూ.500 మాత్రమే ఉన్నాయి. వాటితోనే వ్యాపారం మొదలుపెట్టి ఆయన అంచెలంచెలుగా ఎదిగారు.
ఎంబీఏ మధ్యలో మానేసిన ముకేశ్ అంబానీ
ధీరూభాయ్ అంబానీ ఎప్పుడూ పెద్దపెద్ద కలలు కంటూ ఆ కలల సాకారం కోసం కృషి చేసేవారు. అందరికంటే భిన్నంగా ఆలోచించేవారు. ఈ క్రమంలోనే ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ పేరుతో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇది ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీగా ఎదిగింది. ముంబైకి వచ్చిన తర్వాత ధీరూభాయ్‌కి చిన్న కుమారుడు అనిల్ అంబానీ జన్మించారు. ముకేశ్ అంబానీ 1980 లలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో ఎంబీఏలో చేరారు. కానీ నిజ జీవితం క్లాస్‌రూమ్‌ల కంటే ఎక్కువ నేర్పుతుందని నమ్మి మధ్యలోనే చదువు మానేశారు. అనిల్ అంబానీ ప్రతిష్ఠాత్మక పెన్సిల్వేనియా యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చదివారు.
ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడంతో ముకేశ్ దిట్ట
ఆ తర్వాత తండ్రి ధీరూభాయ్ అంబానీకి సాయంగా సొంత కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి ఆయన తీసుకున్న నిర్ణయాలు కంపెనీ మరింత ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. ముకేశ్ అంబానీ రాబోయే 10 ఏళ్లకు సమాజంలో ఎలాంటి మార్పులు వస్తాయో అంచనా వేసి అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ క్రమంలో ఆయన ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందుకే ఆయన కంపెనీలు నేడు కోట్లకు పడగలెత్తాయి. 2002లో ధీరూభాయ్ అంబానీ మరణించారు. ఆ తర్వాత అన్నదమ్ముల మధ్య గొడవలు రావడంతో.. 2006 లో ఆస్తులను పంచుకున్నారు. ఆ తర్వాత ముకేశ్ అంబానీ తన ఆస్తులను అంతకంతకే పెంచుకుంటూ పోగా.. అనిల్ అంబానీ మాత్రం విఫలమయ్యారు. ప్రస్తుతం ఆయన కంపెనీలన్నీ నష్టాల్లో ఉన్నాయి.
టెలికామ్ రంగంలో రిలయన్స్ విప్లవం
ముకేశ్ అంబానీ పెట్రోలియం రంగంలో, టెలికామ్ రంగంలో భారీ విప్లవం సృష్టించారు. 2016లో రిలయన్స్ సంస్థ జియో టెలికమ్యూనికేషన్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇది భారతదేశంలోని టెలికామ్ పరిశ్రమను పూర్తిగా మార్చివేసింది. ఇది టెలికామ్ ఇండస్ట్రీలో పెను విప్లవానికి కారణమైంది. ముకేశ్ అంబానీ ఫోన్‌లో మాట్లడటం, ఇంటర్నెట్‌ను వినియోగించడాన్ని చాలా చవకగా మార్చేశారు. అపరిమిత వాయిస్ కాల్‌లు, అపరిమిత డేటా ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చారు.
ముకేశ్ అంబానీ నివాసం ఇంద్ర భవనం
ముకేశ్ అంబానీ ప్రస్తుతం ముంబైలో విలాసవంతమైన భవనం అంటీలియాలో నివసిస్తున్నారు. ఈ విలాసవంతమైన భవనం విలువ ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. భారత కరెన్సీ ప్రకారం ఆయన ఇంటి విలువ రూ.8,350 కోట్లు. ఆ భవనంలో మొత్తం 27 అంతస్తులు ఉన్నాయి. భవనం విస్తీర్ణం 4,00,000 చదరపు అడుగులు. ఆ భవనంలో ఉన్నన్ని సౌకర్యాలు ఏ స్టార్ హోటల్‌లోనూ ఉండవు. ముకేశ్ అంబానీ మాన్షన్‌లో 3 హెలిప్యాడ్‌లు, 168 కార్ పార్కింగ్ గ్యారేజీలు, స్పాలు, స్విమ్మింగ్ పూల్స్, ప్రైవేట్ థియేటర్, స్నో ఛాంబర్‌లతో సహా అనేక సౌకర్యాలు ఉన్నాయి. ఒకవేళ నివాస ప్రాంతాల్లో భూకంపం సంభవించి దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6 గా నమోదైతే ఈ ప్రపంచంలోని అనేక ఇళ్లు నేలమట్టమవుతాయి. కానీ భూకంప తీవ్రత 8 నమోదైనా కూడా చెక్కు చెదరకుండా ముకేశ్ అంబానీ ఇంటిని నిర్మించారు. ఈ విలాసవంతమైన భవన నిర్వహణ బాధ్యతలను చూసుకోవడానికి అంబానీ 600 మంది ఉద్యోగులను నియమించుకున్నారు.