top of page
MediaFx

ఎగువసభలో పెరిగిన బీజేపీ బలం.. మెజారిటీ మార్క్‌ను దాటిన ఎన్డీయే కూటమి


రాజ్యసభలో బీజేపీ సంఖ్యా బలం పెరిగింది. మొన్నటి వరకూ ఎగువ సభలో ఎన్డీయే (NDA) కూటమికి మెజారిటీ తక్కువగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో కీలక బిల్లుల ఆమోదం కోసం ఇతర పార్టీ ఎంపీల మద్దతుపై ఎన్డీయే సర్కార్‌ ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది. అయితే, తాజాగా ఆ పరిస్థితిని బీజేపీ అధిగమించింది. తాజాగా రాజ్యసభకు 12 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. వీరిలో తొమ్మిది మంది బీజేపీ సభ్యులు కాగా, ఎన్డీఏ మిత్రపక్షాలైన ఎన్సీపీ (అజిత్‌ పవార్‌) నుంచి ఒకరు, రాష్ట్రీయ లోక్‌మంచ్‌ నుంచి ఒకరు ఉన్నారు. దీంతో ఎగువ సభలో బీజేపీ బలం 96కి పెరిగింది. 245 స్థానాలుండే రాజ్యసభలో ప్రస్తుతం 237 మంది సభ్యులు ఉన్నారు. మెజారిటీ సాధించడానికి 119 మంది సభ్యులు అవసరం. కూటమిగా చూస్తే ఎన్డీయే బలం 121కి చేరింది. దీంతో పార్లమెంటు ఎగువ సభలో బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ఎన్డీయేకి మార్గం సుగమం అయింది. ఇక ప్రతిపక్ష పార్టీల రాజ్యసభ సభ్యుల సంఖ్య 85గా ఉంది.

తాజాగా రాజ్యసభకు ఎన్నికైన 12 మంది సభ్యుల్లో.. బీజేపీ తరపున అస్సాం నుంచి మిషన్‌ రంజన్‌ దాస్‌, రామేశ్వర్‌ తేలి, బీహార్‌ నుంచి మనన్‌ కుమార్‌ మిశ్రా, హర్యానా నుంచి కిరణ్‌ చౌదరి, మధ్యప్రదేశ్‌ నుంచి జార్జ్‌ కురియన్‌, మహారాష్ట్ర నుంచి ధైర్యశీల్‌ పాటిల్‌, ఒడిశా నుంచి మమతా మహంత, రాజస్థాన్‌ నుంచి రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టు, త్రిపుర నుంచి రాజీవ్‌ భట్టాచార్య రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ తరపున తెలంగాణ నుంచి అభిషేక్‌ మను సింఘ్వి, ఎన్సీపీ తరపున మహారాష్ట్ర నుంచి నితిన్‌ పాటిల్‌, ఆర్‌ఎల్‌ఎం తరపున బీహార్‌ నుంచి ఉపేంద్ర కుశ్వాహ ఏకగ్రీవంగా గెలుపొందారు.

bottom of page