తెలంగాణ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది బీజేపీ. అందుకు తగ్గట్లుగానే అగ్రనేతలు క్యాంపైయిన్ చేస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో ప్రధాని పర్యటన ఉంది.
అంతేకాదు నవంబర్ 25, 26, 27 తేదీల్లో కూడా మోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. 25న కరీంనగర్, 26న నిర్మల్ జన గర్జన సభల్లో ప్రధాని పాల్గొంటారు. 27న హైదరాబాద్ లో మోడీ భారీ రోడ్ షో ఉంటుంది. ఈ లోపు మరికొందరు కేంద్ర మంత్రులు, పలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు.
తెలంగాణలోని ఎస్సీ జనాభాలో 60 శాతం మంది మాదిగలు ఉంటారని అంచనా. 2014లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలో మాదిగ జనాభా 46 లక్షలని, మాలల జనాభా 21 లక్షలని MRPS వర్గాలు చెప్పున్నాయి. తెలంగాణలో 20-25 నియోజకవర్గాల్లో ఫలితాలను తారుమారు చేసే స్థాయిలో మాదిగలు ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో MRPS కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడమే కాదు ఆ పార్టీ తరపున ప్రచారం కూడా నిర్వహించింది. ఈ ఎన్నికల్లో MRPS తమ మద్దతు ఎవరికన్నది ఇంత వరకు ఎక్కడా బహిరంగంగా ప్రకటించలేదు. ఈ క్రమంలో ఆ సంఘం నిర్వహిస్తున్న సభకు ప్రధానిని ఆహ్వానించడం చూస్తుంటే కమలం వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. MRPS అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ గత నెల ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాను కలిసి వర్గీకరణపై విజ్ఞాపన పత్రం అందజేశారు. దీనికి షా సానుకూలంగా స్పందించారనే మంద కృష్ణ వెల్లడించారు. ఈ క్రమంలో పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న సభలో ప్రధాని మోదీ వర్గీకరణపై స్పష్టమైన ప్రకటన చేస్తారని MRPS గట్టి నమ్మకంతో ఉంది. 🗳️🇮🇳