ఓషన్ గేట్ టైటాన్ సబ్‌మెర్సిబుల్ (Titan submersible).. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చిన న్యూస్ ఇది. టైటాన్ ప్రమాదం తర్వాత ఓషన్ గేట్ సంస్థ.. అండర్ వాటర్ టూరిజంకు పుల్ స్టాప్ పెడుతుందని అంతా అనుకున్నారు.
కానీ.. ప్రమాదం జరిగి పట్టుమని పది రోజులైనా గడవకముందే.. టైటానిక్ శకలాలు (Titanic wreckage) చూసొద్దాం రండి అంటూ.. ఓషన్ గేట్ యాడ్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. దాంతో.. టైటాన్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ (Hot Topic)గా మారింది.అమెరికాకు చెందిన అండర్ వాటర్ టూరిజం కంపెనీ ఓషన్‌గేట్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో ఐదుగురి ప్రాణాలను బలిగొన్న టైటాన్ సబ్ మెర్సిబుల్ విషాదం జరిగి.. పదిరోజులైనా గడవక ముందే.. టైటానిక్ శకలాలు చూద్దాం రండి అంటూ.. మళ్లీ యాడ్స్‌తో ఊదరగొడుతోంది. అట్లాంటిక్‌లో మునిగిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు.. ఇదే మా ఆహ్వానమంటూ ఓషన్‌గేట్ కంపెనీ ప్రకటనలిస్తోంది. ఓ వైపు టైటాన్ సబ్‌మెర్సిబుల్ శకలాలను బయటకు తీసుకురావడం.. ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతున్న వేళ.. ఈ పరిణామం చోటుచేసుకోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి.ఓషన్‌గేట్ వెబ్‌సైట్ ప్రకారం.. వచ్చే ఏడాది రెండు ట్రిప్‌లకు ప్రకటన ఇచ్చుకుంది. 2024 జూన్ 12వ తేదీ నుంచి జూన్ 20 మధ్య, అలాగే 2024 జూన్ 21 నుంచి జూన్ 29 మధ్య రెండు ట్రిప్పులు ప్లాన్ చేసినట్లు ఓషన్‌గేట్ కంపెనీ ప్రకటనలిచ్చింది. టికెట్ ధరను 2 లక్షల 50 వేల డాలర్లుగా ప్రకటించింది. అయితే అది టైటాన్‌లోనా? వేరే ఏదైనా సబ్‌మెర్సిబుల్‌లోనా? అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇక.. సబ్ పైలట్ పొజిషన్ కోసం కూడా ఓషన్ గేట్ కంపెనీ ఓ యాడ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. టైటాన్ శకలాల గాలింపు సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోగా.. విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో.. ఆ జాబ్ యాడ్‌ను ఓషన్‌గేట్ తొలగించింది.